కరోనా కాటుకు అక్షయ తృతీయ సెంటిమెంట్ కూడా గాయబ్!..

భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే. ఈరోజు బంగారం కొని లక్ష్మీ దేవిని అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో వర్తిల్లుతుందని భక్తుల నమ్మకం. ఇవే కాకుండా ఈ పండగకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజు చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు అక్షయమైన ఫలితాలనిస్తాయి. ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం వివరిస్తోంది. అక్షయ తృతీయనాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలానిస్తాయని నారద పురాణం చెబుతోంది. ఈ శుభ తిథిన ఏ పనిచేసినా అది విజయవంతం అవుతుంది. అలాగే ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ ఉండవు. ఈ తిథి రోజు మొత్తం శుభకార్యాలను జరపించుకోవచ్చు. బంగారం షాపుల ముందు కస్టమర్ల క్యూలు.. వినియోగదార్లతో కిటకిటలాడే దుకాణాలు. అక్షయ తృతీయ అనగానే సాధారణంగా ఇవే గుర్తొస్తాయి. కోవిడ్–19 మహమ్మారి ఒక్కసారిగా మార్కెట్ను తారుమారు చేసింది. వరుసగా రెండవ ఏడాదీ పరిశ్రమను దెబ్బతీసింది. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్తో జువెల్లరీ షాపులు మూతపడ్డాయి. పాక్షిక లాక్డౌన్ కొనసాగుతున్న రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని దుకాణాలే తెరుచుకున్నాయి. వీటిలోకూడా వినియోగదార్లు లేక వెలవెలబోయాయి. వైరస్ భయంతో కస్టమర్లు బయటకు రాలేదు. మరోవైపు పరిమిత సమయం దుకాణాలు తెరిచే అవకాశం ఉన్నా చాలాచోట్ల వర్తకులు ఆసక్తి చూపలేదు. సాధారణంగా అక్షయ తృతీయ రోజు దేశవ్యాప్తంగా సుమారు 30 టన్నుల పుత్తడి అమ్ముడవుతుంది. ఈసారి ఒక టన్ను కూడా విక్రయం కాలేదని పరిశ్రమ వర్గాలు సమాచారం. ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, పుణేతోపాటు పుత్తడి అధికంగా విక్రయమయ్యే కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో ఆఫ్లైన్ సేల్స్పై తీవ్ర ప్రభావం పడిందిట. 90 శాతం రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉంది. ఈ రాష్ట్రాల్లో అమ్మకాలు నిల్. జరిగిన కొద్ది విక్రయాలు కూడా ఫోన్, డిజిటల్ మాధ్యమం ద్వారా జరిగాయి. గతేడాది 2.5 టన్నులు విక్రయమైతే, ఈ ఏడాది 3–4 టన్నులు కస్టమర్ల చేతుల్లోకి వెళ్తుందని భావించారు.