ఇటీవలే ఆసియా కప్ కి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఒక్క వన్డే కూడా ఆడని తిలక్ ని నేరుగా వరల్డ్ కప్ ఆడించకూడదని భారత మాజీ క్రికెటర్ సూచించాడు.
భారత క్రికెట్ లోకి మరో యంగ్ క్రికెటర్ దూసుకొస్తున్నాడు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా ఒక తెలుగు కుర్రాడు తక్కువకాలంలోనే ఇలా జాతీయ జట్టులోకి దూసుకురావడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. గత రెండేళ్లుగా తిలక్ వర్మ ప్రస్తానం చూసుకుంటే ఎంతో పరిణితి చెందిన ఆటతీరు కనబరుస్తున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుంటున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఐపీఎల్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ లో తన సత్తా చూపిస్తున్నాడు. ఇటీవలే విండీస్ పర్యటనలో టీ 20 ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఈ యంగ్ స్టర్ ఏకంగా వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చాడు. ప్రస్తుతం తిలక్ వర్మ ఆట తీరు చూసిన వారెవరైనా ప్రశంసించకుండా ఉండలేరు.
మరో రెండు నెలలో స్వదేశంలో వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కీలక ప్లేయర్ల గాయాలు టీమిండియాని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ సమస్య జట్టుని బాగా వేధిస్తుంది. పంత్ దాదాపుగా వరల్డ్ కప్ రేస్ నుంచి నిష్క్రమించగా.. అయ్యర్, రాహుల్ గాయాల విషయంలో ఒక క్లారిటీ లేదు. ఇక కీలకమైన నాలుగో స్థానం కోసం మరోసారి యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తిలక్ వర్మ నాలుగో స్థానంలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిలక్ నాలుగో స్థానానికి సరైనోడు అని అభిమానులతో పాటు ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఇటీవలే ఆసియా కప్ కోసం సెలక్ట్ చేసిన 17 మందిలో జట్టులో కూడా తిలక్ వర్మ పేరు కూడా ఉంది. అయితే ఒక్క వన్డే కూడా ఆడకుండా తిలక్ ని వరల్డ్ కప్ ఆడిస్తే ప్రమాదమేనని చెప్పుకొచ్చాడు మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్.
“తిలక్ వర్మ చాలా టాలెంటెడ్. మంచి ప్లేయర్ కూడా. అయితే ఎంత బ్రిలియెంట్ ప్లేయర్ అయినా ఆసియా కప్ లాంటి బిగ్ టోర్నమెంట్‌లో ఆరంగ్రేటం చేయించడం సరైన పద్ధతి కాదు. దానికి ముందు అతనితో కొన్ని వన్డే సిరీస్‌లు ఆడించాలి. సౌరవ్ గంగూలీ కూడా ఈ విషయం చెప్పాడు. తిలక్ వర్మకు అంతర్జాతీయ వన్డేలు ఆడిన అనుభవం లేదు. ఎలాంటి అనుభవం లేకుండా వరల్డ్ కప్‌లో ఆడించాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ముందు అతను కొన్ని టీ20 సిరీస్‌లు ఆడాలి. అలాగే వన్డే సిరీస్‌లు ఆడుతూ వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి సిద్ధం చేయాలి. ఓ యంగ్‌స్టర్‌ని తయారుచేసే పద్ధతి అలాగే ఉంటుంది. ఏదైనా తేలిగ్గా దొరికేస్తే దానికి విలువ ఉండదు. తిలక్ వర్మ లేదా మరే యంగ్ ప్లేయర్ అయినా, స్టార్ ప్లేయర్‌గా రాటుతేలాలంటే అతన్ని ద్వైపాక్షిక సిరీసుల్లో పరీక్షించాలి. ఆ తర్వాతే మెగా టోర్నీల్లో ఆడించాలి” అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.