పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడికి పాల్పడింది ఓ యువతి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కారు నుండి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడికి పాల్పడింది ఓ యువతి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో గ్యాస్ నింపుతున్నప్పుడు పంప్ ఆపరేటర్ కారులో కూర్చున్న వ్యక్తులను కిందకు దిగాలని కోరాడు. దీంతో కారులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది మధ్య వివాదం మొదలైంది.
షాబాద్ ప్రాంతానికి చెందిన ఎహ్ సన్ ఖాన్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిల్ గ్రామ్ కొత్వాలి ప్రాంతంలోని సాండి రోడ్‌లోని పెట్రోల్ పంపునకు తన కుమార్తె సురీష్ ఖాన్ అలియాస్ అరిబా, భార్య హుస్న్ బానోతో కలిసి కారులో వచ్చారు. అయితే కారులో గ్యాస్ నింపుతుండగా.. వారిని కారు నుంచి దిగమని కోరాడు ఉద్యోగి రజనీష్ కుమార్. వారు దిగకపోవడంతో కారులో గ్యాస్ నింపడానికి నిరాకరించాడు ఉద్యోగి రజనీష్ కుమార్. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అయితే ఈ క్రమంలో ఎహ్ సన్ ఖాన్ కుమార్తె తన తండ్రితో గొడవపడుతున్న ఉద్యోగిపై దూసుకొచ్చింది. అయినప్పటికీ గొడవ పెద్దది కావడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లి కారులో ఉన్న తుపాకీని తీసుకొచ్చింది అరిబా. వెంటనే ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడికి యత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో పెట్రోల్ బంక్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం యువతిని, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని.. లైసెన్స్ పొందిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.