నేటి సమాజంలో కొందరు యువకులు ఘోరాలకు పాల్పడుతున్నారు. అబ్దులాపూర్ మెట్ లో స్నేహితుడిని చంపిన ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తాజాగా అలాంటి ఘోరమైన ఘటన మరొకటి చోటుచేసుకుంది. కార్డు బదులు డబ్బులు ఇవ్వండి అని అడిగినందుకు ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు కొట్టి చంపేశారు.
ఈ మధ్యకాలంలో కొందరు యువకులు అతిగా ప్రవర్తిస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో మహిళల పట్ల, తోటి వారిపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక గ్యాంగ్ లుగా ఏర్పడి బైక్ లపై తిరుగుతూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొందరు మద్యం మత్తులో అకారణంగా గొడవలు పెట్టుకుని అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఓ ముగ్గురు యువకులు అలాంటి దారుణానికి ఒడిగట్టారు. పెట్రోల్ బంక్ లో పనిచేసే సిబ్బందితో గొడవ పెట్టుకుని.. వారిలో ఓ వ్యక్తిని చంపేశారు. ఈ ఘటన దారుణ రంగారెడ్డి జిల్లా నార్సింగిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా జన్వాడ వద్ద గల పెట్రోల్ బంకు వద్దకు సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు కారులో ముగ్గురు యువకులు వచ్చారు. అప్పటికే బంక్ మూసేసి ఉండటంతో.. అక్కడే ఉన్న సిబ్బందిని పెట్రోలో పోయాలని కోరారు. అంతేకాక తాము చాలా దూరం వెళ్లాల్సి ఉందని, పెట్రోల్ పోయాలని సిబ్బందిని కోరారు. దీంతో వారు కూడా అర్థరాత్రి సమయంలో నిద్రలేచి మరీ యువకుల కారుకి పెట్రోల్ కొట్టారు. అనంతరం ఆ యువకులు డబ్బులను చెల్లించేందుకు గానూ కార్డ్ ఇచ్చారు. తమ దగ్గర ఉన్న స్వైప్ మిషన్ పనిచేయటం లేదని.. డబ్బులు ఉంటే ఇవ్వాలని బంక్ సిబ్బంది యువకులను కోరారు. అయితే తమకే ఎదురు మాట్లాడుతావా? అంటూ అక్కడి సిబ్బందిపై దాడి చేశారు.
అయితే ఆ ముగ్గురు యువకులు దాడి చేయడానికి సంజయ్ అనే మరో సిబ్బంది గమనించాడు. వెంటనే ఆ యువకులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్లు సంజయ్ పై కూడా పిడిగుద్దులు కురిపించారు. వారి దెబ్బలకు తట్టుకోలేక సంజయ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ముగ్గురు యువకులు సిబ్బందిపై దాడి చేసి అనంతరం పారిపోయారు. గాయపడిన సంజయ్ ను తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. స్థానికులు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడి వారిని సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆతరువాత అక్కడ ఉండే సీసీటీవీ పుటేజ్ ను పరిశీలించారు. ముగ్గురు యువకులపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన నిందితులు అనోక్, నరేందర్, మల్లేష్‌గా పోలీసులు గుర్తించారు. గతంలో ఈ ముగ్గురు యువకులు పలు కేసుల్లో ప్రధాన నిందితులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వైప్ మిషన్ పనిచేయడం లేదనందుకే మనిషిని చంపేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.