మన దేశంలో ప్రభుత్వం నుంచి అందే ఉచిత సర్వీస్‌లు ఏవి జనాలకు సరిగా చేరవు. గవర్నమెంట్ ఆస్పత్రులు, స్కూల్స్‌లో సర్వీసులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉచితం అంటే మన దగ్గర అంత లోకువ. వాటి సంగతి పక్కకు పెడితే.. పెట్రోల్ బంకుల్లో కొన్ని ఉచిత సర్వీస్‌లు ఉన్నాయనే విషయం మీకు తెలుసా..
హెడ్డింగ్ చదవగానే ఆశ్చర్యపోయారా.. పెట్రోల్ బంకుల్లో మోసం చేయకుండా ఇచ్చిన డబ్బుకు సరిపడా పెట్రోల్ పోయడమే గగనం.. అలాంటిది అక్కడ ఉచిత సేవలు కూడా అందుబాటులో ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు. కానీ మీరు నమ్మినా, నమ్మకపోయినా.. పెట్రోల్ బంకుల్లో కొన్ని ఉచిత సర్వీస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉంచాలి కూడా. అసలు ఈ సేవలు కల్పిస్తామని చెబితేనే ప్రభుత్వాలు.. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇస్తాయి. అంటే ఇవి ఖచ్చితంగా అందించాల్సిన సేవలు అని అర్థం. ఒకవేళ ఎవరైనా పెట్రోల్ బంక్ యాజమాన్యం.. మీకు ఈ సేవలను అందించకపోతే.. వారిపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. మరి ఇంతకు ఆ ఉచిత సేవలు ఏంటో తెలియాలంటే..
పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ మాత్రమే కాక.. ప్రజల కోసం బంకు యాజమాన్యం.. కొన్ని ఉచిత సర్వీసులును అందుబాటులో ఉంచాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఆరు సర్వీస్‌లను పెట్రోల్ బంకుల్లో ఉచితంగా అందించాలి. అవి ఏవి అంటే..
ప్రెటోల్ బంక్‌లో ప్రధానంగా అందుబాటులో ఉంచాల్సిన ఫ్రీ సర్వీస్ ఏంటంటే.. ఉచిత మంచి నీటి సదుపాయం. ఇందుకోసం పెట్రోల్ బంక్ యాజమాన్యం.. ఆర్వో మెషన్, వాటర్ కనెక్షన్ పొంది ఉండాలి. ఉచిత మంచి నీటి సౌకర్యం కల్పించని బంకు మీద ఫిర్యాదు చేయవచ్చు.
అలానే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా.. ప్రతి బంకులో మహిళలు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. దీనిపై కొన్ని రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. మరో ముఖ్య విషయం ఏంటంటే.. మనం కొనుగోలు చేసే ప్రతీ లీటర్ పెట్రోల్ మీద 4-8 పైసలు టాయిలెట్, మరుగుదొడ్ల నిర్వహణ కోసం బంక్ యజమానులకు చెల్లిస్తున్నాం. ఈ విషయం చాలా మందికి తెలియదు.
ముఖ్యంగా పెట్రోల్ బంకులకు సంబంధించి ప్రధానంగా వినిపించే సమస్య.. పెట్రోల్, డీజిల్‌లో జరిగే కల్తీ గురించి. దీని మీదే ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి. కనుక బంకుల్లో పెట్రోల్, డీజిల్ నాణ్యత ప్రమాణాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్క వాహనదారుడికి ఉంటుంది.
ఇక ప్రతి వాహనానికి అంటే టూ వీలర్, త్రివీలర్, ఫోర్ వీలర్ ఇలా ఏ వాహనం అయినా సరే.. వాటికి పెట్రోల్ బంకుల్లో ఉచితంగా గాలి కొట్టాల్సిందే. ఇందుకోసం డబ్బులు తీసుకోకూడదు. కానీ చాలా బంకుల్లో ఒక్క టైర్‌కు 5 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది ఉచిత సర్వీస్ అని తెలుసుకొండి.
పెట్రోల్ బంక్‌కు వచ్చిన సమయంలో ఏదైనా ప్రమాదం చోటు చేసుకుని.. వినియోగదారులకు గాయాలు అవ్వడం వంటి ఘటనలు చోటు చేసుకుంటే.. వారికి పెట్రోల్ బంకుల్లోనే ఉచితంగా ప్రథమ చికిత్స అందించాలి. ఇందు కోసం బంకుల్లో ఫస్ట్ ఎయిట్ కిట్ తప్పనిసరిగా ఉండాలి.
బంకుకు వచ్చిన వినియోగదారులకు ఉచితంగా ఫోన్ సర్వీస్ అందించాలి. కస్టమర్లు.. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా ఫోన్ చేసుకునేందుకు పెట్రోల్ బంకుల్లో ఉన్న ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.
ఇక పెట్రోల్ బంకుల్లో పైన చెప్పిన సర్వీస్‌లు అందుబాటులో లేకపోయినా.. దీని గురించి యాజమాన్యం సరైన సమాధానం చెప్పకపోయినా సదరు బంక్ మీద ఫిర్యాదు చేయవచ్చు. బంకుల్లో మీరు ఈ ఉచిత సర్వీసులను ఎప్పుడైనా వినియోగించుకున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.