కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చింతలగుంట అనే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కలదు. అక్కడ పాఠశాలకు పక్కా భవనం లేక తాత్కాలికంగా ఓ ఇంట్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దుతున్నామని నేతలు ఉపన్యాసాలు దంచుతున్నారు. కానీ అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా కనిపిస్తుంది. విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా.. కనీస సదుపాయాలు లేని ప్రభుత్వ స్కూళ్లు ఎన్నో ఉన్నాయి. ఆడపిల్లలకు టాయిలెట్స్ కూడా లేకుండా పాఠశాలలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థి పాఠశాలలో కరెంట్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చింతలగుంట అనే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కలదు. అక్కడ పాఠశాలకు పక్కా భవనం లేక తాత్కాలికంగా ఓ ఇంట్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. అదే గ్రామంలో ఎస్సీకాలనీలో లంక రవి, నవ్యకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కార్తిక్ అనే 8 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. ఆ అబ్బాయి రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం నాడు భోజనం తర్వాత బోరు వద్దకు వెళ్లగా.. ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు మోటార్ ఆన్ చేశారు. బోర్ పాయింట్ ద్వారా కరెంట్ ప్రవహించడంతో దానిని తాకగానే కార్తిక్ షాక్ తో కిందపడిపోయాడు. వెంటనే బాలున్ని ఆస్పత్రికి తరలించకుండా తరగతి గదిలోనే పడుకోబెట్టాడు.
ఈ విషయం తెలిసిన గ్రామస్తులు బాలున్ని గుడ్లవల్లేరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. తల్లిదండ్రులు బాలుడి మృతదేహాన్ని స్కూల్‌కు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. దీంతో గుడివాడ ఆర్టీవో బాలుని మృతికి పరిహారం ఇవ్వడానికి హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు, కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. ఘటనకు బాధ్యుడైన టీచర్‌ను సస్పెండ్ చేయాలని పై అధికారులకు నివేదించినట్లు ఎంఈవో -2 తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఊరిలో ఓ దాత పాఠశాల కొరకు స్థలం దానమిచ్చి.. నాలుగు సంవత్సరాలు గడిచినా భవనం నిర్మించలేదు. నాడు-నేడు నిధులు విడుదలైతే స్కూల్ భవనం పూర్తయ్యేది. ఈ ప్రమాదం జరిగేది కాదని గ్రామస్తులు తెలుపుతున్నారు.