ఆస్తమాతో బాధపడే వారు చేప మందును ఓ ప్రసాదంలా భావించేవారు. వీరి కోసం మృగశిర కార్తె వచ్చిందంటే చాలు చేపమందును జోరుగా పంపిణీ చేసేవారు బత్తిని సోదరులు.
ఆస్తమాతో బాధపడే వారు చేప మందును ఓ ప్రసాదంలా భావించేవారు. వీరి కోసం మృగశిర కార్తె వచ్చిందంటే చాలు చేపమందును జోరుగా పంపిణీ చేసేవారు బత్తిని సోదరులు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా వేలాది మంది ప్రజలకు చేప మందును అందించేవారు. తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి చేప మందు కోసం తరలివచ్చేవారు. అంతటి ప్రాధాన్యత ఉన్న చేప మందును పంపిణీ చేసేటువంటి బత్తిని సోదరులలో ఒకరైన బత్తిని హరినాథ్ గౌడ్ తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అతడు తుది శ్వాస విడిచారు. దీంతో బత్తిని కుటుంబంలో విషాదం అలుముకుంది.
చేప మందు పంపిణీ చేసే బత్తిని కుటుంబంలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న బత్తిని హరినాథ్ గౌడ్ పరిస్థితి పూర్తిగా విషమించడంతో బుధవారం అర్థరాత్రి మరణించారు. ఎన్నో ఏండ్ల నుంచి బత్తిని కుటుంబం చేప మందును పంపిణీ చేస్తోంది. మృగశిర కార్తె ప్రారంభంలో రెండ్రోజుల ముందుగానే ఆస్తమా బాధితులు హైదరాబాద్ కు చేరుకునే వారు. చేప మందును ప్రసాదంలా భావించేవారు. చేప మందు కోసం వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేసేది. గత రెండు నెలల క్రితం కూడా చేప మందు పంపిణీని చేపట్టారు బత్తిని సోదరులైన బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్.