ప్రస్తుతం అనేక మంది కొవిడ్ రోగులు వైద్యసాయం కోసం సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. దీంతో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తన సోషల్ మీడియా ఖాతాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తన ఖాతా ద్వారా పోస్ట్ చేసేందుకు అనుమతించారు. ఆస్పత్రులకు పడకలు అందించటంతో పాటు, కొన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్నారు జాన్ అబ్రహం. అలియా భట్ సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు.
తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా కొవిడ్ బాధితులు, వారి కుటుంబ సభ్యుల నుంచి అభ్యర్థనలను స్వీకరించి వారికి కావాల్సిన సాయం అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొవిడ్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు తాప్సీ. ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర ఔషధాలు, హాస్పిటల్ అడ్మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రూ. కోటి విరాళంగా ఇచ్చారు. మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ నడుపుతోన్న స్వచ్ఛంద సంస్థకు ఆయన ఈ ఆర్థిక సాయం అందజేశారు.
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కరోనాపై పోరాటానికి తమవంతు సాయం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 7 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. కొవిడ్ బాధితులకు సేవలందిస్తోన్న పోలీసులు, ఆరోగ్యకార్యకర్తలు, వైద్యసిబ్బందికి పోషకాహారాన్ని అందిస్తున్నారు సల్మాన్‌ఖాన్. దీనికోసం ఆయన ‘భాయి జాన్స్ కిచెన్ రెస్టారెంట్’ను ఏర్పాటు చేశారు. రోజుకు 5 వేల మందికి ఆహారాన్ని అందించే సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేశారు.