ఈ మధ్య కాలంలో విడాకులు అనేది సర్వ సాధారణ అంశం అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో కూడా విడాకులు తీసుకుంటున్న వారు ఉన్నారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విడిపోతున్నారు. అయితే విడాకులు అనేది వివాహ వ్యవస్థకి భంగం కలిగించే అంశం కాబట్టి చాలా మందికి రుచించదు. నిహారిక కొణిదెల విషయంలో కూడా చాలా మంది విడాకుల అంశం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తాజాగా ఈ విడాకుల అంశంపై లైఫ్ కోచ్ ప్రియా చౌదరి ఘాటుగా స్పందించారు.
సామాన్యుడి జీవితం ఎలా ఉంటుందో అనేది ప్రపంచానికి తెలియదు. గట్టిగా తెలిస్తే చుట్టుపక్కల కుటుంబాలకు తెలుస్తుంది. ఇంకా ఎక్కువగా తెలిస్తే ఒక ఊరికి తెలుస్తుంది. కానీ సెలబ్రిటీల గురించి అలా కాదు. ఏ చిన్న విషయమైనా సరే మొత్తం ప్రపంచానికి తెలిసిపోతుంది. అయితే ఒక వ్యక్తి వ్యక్తిగత విషయంలో తలదూర్చకూడదన్న ఇంగితం లేకుండా కొంతమంది అదే పనిగా ఆ వ్యక్తిని మానసికంగా హింసిస్తారు. వార్తలు సమాజానికి తెలియజేయాలి. అదే విధంగా సెలబ్రిటీల గురించి కూడా వార్తలు తెలియజేయాలి. కానీ అదే పనిగా చెప్పిందే చెప్పి, వేసిందే వేసి న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు. మెగాస్టార్ చిరంజీవి చాలా కింద నుంచి వచ్చిన వ్యక్తి. సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి. ఇండస్ట్రీలో ఒక శిఖరంలా ఎదిగిన వ్యక్తి.
అలాంటి వ్యక్తి కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తే భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నారు కొంతమంది. రాజకీయంగా టార్గెట్ చేస్తూ మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దీనిపై రాద్ధాంతం చేయవద్దని.. ఇది తన వ్యక్తిగత విషయమని నిహారికా అన్నారు. కానీ కొంతమంది విడాకుల అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. తాజాగా దీనిపై లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కన్సల్టెంట్ ప్రియా చౌదరి స్పందించారు. వ్యక్తిగత విషయం గురించి అదే పనిగా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. కూతురు విషయంలో అందరి తండ్రుల్లానే చిరంజీవి కూడా సున్నితంగా ఉంటారని.. ఆయనకు మనసు ఉంటుందని.. గాయపరచడం కరెక్ట్ కాదని అన్నారు.
అనుకోని కారణాల వల్ల ఇలా జరుగుతున్నా కూడా పిల్లల జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టాలన్న తాపత్రయమే తప్ప ఏ తండ్రి కూడా పిల్లల జీవితాలను నాశనం చేయాలని అనుకోరని అన్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసి నేర్చుకోవాలని.. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులను చూసి ఓర్పు, నేర్పు నేర్చుకోవాలని.. సహనం కలిగి ఉండాలని ఆమె అన్నారు. చిరంజీవి, సురేఖ దంపతుల పెళ్లి పుస్తకం చదివితే వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారో తెలుస్తుందని అన్నారు. జీవితంలో భార్యాభర్తల మధ్య అడ్జస్ట్ మెంట్ అనేది ఉండాలని.. అప్పుడే ఇద్దరి జీవితం బాగుంటుందని అన్నారు. దాంపత్య జీవితం అంటే భార్యాభర్తలు మాత్రమే కాదని.. రెండు కుటుంబాలు కూడా అని.. ఆ కుటుంబాలకు గౌరవం ఇచ్చే విధంగా ప్రవర్తించాలని అన్నారు. అయితే సమాజాన్ని ప్రభావితం చేసే మనుషులు, వారి కుటుంబ సభ్యులు.. సమాజంలో ఉన్నామన్న విషయం మర్చిపోకూడదని.. జాగ్రత్తగా జీవించాల్సి ఉంటుందని అన్నారు.