ఓ మై గాడ్.. అతను బిచ్చగాడు కాదు లచ్చాధికారి!!..

కలియుగ వైకుంఠంగా, ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుమలలో అనూహ్య సంఘటన వెలుగులోకి వచ్చింది. వడ్డీకాసులవాడి సమక్షంలో ఓ బిచ్చగాడు లక్షాధికారి అయిన వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శ్రీవారి ఆలయన్ని, అక్కడికి వచ్చే భక్తులను నమ్ముకుని కొన్ని వందల మంది అనాథలు, బిచ్చగాళ్లు తిరుమలలో కాలం వెళ్లదీస్తున్నక్రమంలో ఓ యాచకుడి ఇంట్లో ఏకంగా రూ.10లక్షలు దొరకడం స్థానికంగా సంచలనం రేపింది. నా అన్న వాళ్లెవరూ లేని అనాథ. అతని గది తెరచి చూస్తే రెండు ట్రంకు పెట్టెలు, మూట కట్టిన బస్తా కనిపించాయి. వాటిలో పెట్టెల నిండా నోట్లు, చిల్లర నాణేలే కనిపించాయి. తిరుమలలో బిచ్చమెత్తుకుని జీవిస్తున్న శ్రీనివాసాచారి నిర్వాసితుడని గుర్తించి తిరుమల శేషాచల కాలనీలో రూమ్ నెంబర్ 75ను దేవస్థానం అతనికి కేటాయించింది.

ttd vigilance

దేవస్థానం ఇచ్చిన గదినే నివాసంగా ఉపయోగించుకుంటున్న శ్రీనివాసాచారి తిరుమలలో అప్పుడప్పుడు చిరు వ్యాపారాలు చేసుకుంటూ బిచ్చమెత్తుకుంటూ జీవించాడు. గత ఏడాది ఆరోగ్య సమస్యల వల్ల మరణించిన శ్రీనివాసాచారికి వారసులెవ్వరు లేకపోవడంతో తిరుమల దేవస్థానం అతను నివసించిన ఇంటిని సీజ్ చేసి పెట్టింది. ఇవాళ తనిఖీలు చేస్తుండగా రెండు ట్రంకు పెట్టెలు, మూట కట్టిన గోనె సంచి కనిపించాయి. వాటిని తెరిచి షాక్ కు గురైన టీటీడీ విజిలెన్స్ వారు ట్రంకు పెట్టెల నిండా డబ్బులు ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విజిలెన్స్ సమక్షంలో రెండు గంటలు కష్టపడి డబ్బులన్నీ లెక్కించగా 10 లక్షల వరకు ఉన్నట్లు తేలింది. ఇందులో గతంలో రద్దు చేసిన పాత వెయ్యి రూపాయల నోట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ డబ్బును విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి ట్రెజరీకి తరలించారు.