పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పేరు వినపడితే చాలు.. పునకాలు వచ్చిన మాదిరి ఊగిపోతారు ఫ్యాన్స్. ఆయన మీటింగ్, సభ ఇలా ఏది నిర్వహించినా సరే భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నాడు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ ఉత్తరాంధ్ర పర్యటనకు పిలుపునిచ్చిన సందర్భంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో చూశాం. ఈ క్రమంలో మంగళగిరి జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ విన్నవాళ్లు ఆశ్చర్యపోయారు.
ఇన్నాళ్లు ప్రత్యర్థులు తనపై చేస్తోన్న ఆరోపణలకు ఒక్క స్పీచ్‌తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అంతేకాక రాబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నా.. ఒంటరిగా బరిలో నిలిచినా.. సీఎం అభ్యర్థి తానే అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు పవన్. దీనిపై జనసేన కార్యకర్తుల కూడా ఆనందం వ్యక్తం చేశారు. పవన్ ప్రసంగం అనంతరం చంద్రబాబు కూడా వచ్చి ఆయనను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఆయన అనేకమంది సినీ, రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెప్పడం.. అందులో కొన్ని నిజం కావడంతో.. వేణు స్వామికి క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో తాజాగా ఆయన టీడీపీ-జనసేన పొత్తు గురించి, పవన్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పని చేస్తే.. భవిష్యత్తు ఎలా ఉంటుందనే అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు.. ఎలాగంటే ఒక పార్టీ గెలిచిందన్నా.. ఓడిందన్నా ఆయనే వల్లే సాధ్యం అవుతుంది.. కానీ ఆయన గెలవడానికి అవేవి ఉపయోగపడవు. వేరే వాళ్లని సీఎంని చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాల్సిన పనిలేదు. అలాంటి పరిస్థితులే కొనసాగితే.. ఆయనకు రాజకీయాలు అవసరం లేదు. సినిమాలు చేసుకుంటే ఒక్క సినిమాకు ఆయనకు రూ.70 కోట్లు ఇస్తారు. ప్రశాంతంగా ఉండొచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ నేనే సీఎం అని చెప్పాలి. ఆయన ఆ మాట చెప్తే.. అప్పుడు టీడీపీ, బీజేపీలు సహకరిస్తాయా.. లేవా అన్నది తెలిసిపోతుంది. జగన్‌ని ఓడిస్తారా లేదా.. అన్నది పక్కనపెడితే.. జనసేన, టీడీపీ, బీజేపీ కలిస్తే మాత్రం సంచలనం నమోదు అవుతుంది’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘అయితే ఆ సంచలనం నమోదు కావాలంటే.. పవన్ కళ్యాణ్‌ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి.. ఆయన కింద పనిచేస్తానని చెప్పాలి. మరి చంద్రబాబు.. లోకేష్ బాబు అలా చెప్తారా లేదా.. అన్నది చూడాలి. ఇక వీరంతా ఒకే స్టేజ్ మీద ఎక్కారంటే ప్రపంచ వింతే. పవన్ కళ్యాణ్‌ని సీఎం అభ్యర్ధిగా చంద్రబాబు ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు ఉంటాయి. అయితే వీరి నక్షత్రాల పరంగా చూసుకుంటే.. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం.. పవన్ కళ్యాణ్‌ది ఉత్తర ఆషాడ నక్షత్రాలు. ఈ రెండూ విరుద్ధంగా ఉంటాయి. అస్సలు పడవు. వీళ్లు దూరం దూరంగా ఉన్నప్పుడే బాగుంటారు.. దగ్గరకొస్తే కలవరు. జాతకం ప్రకారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే అధికారం కాదు అంధకారం అవుతుంది.. వీరిద్దరూ కలిసినా.. వాళ్ల నక్షత్రాలు కలవవు.. అది ప్రత్యర్ధి పార్టీలకు అనుకూలంగా మారుతుంది’’ అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.