మళ్లీ వానల జోరు కొనసాగనున్నది. అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
గత కొద్ది రోజులుగా విరామమిచ్చిన వరుణుడు మళ్లీ విరుచుకుపడనున్నాడు. కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వానలు మళ్లీ కురవనున్నాయి. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే ఐదు రోజులు వానలు కురుస్తాయని వెల్లడించింది. తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా భారీ వర్షాలు కురిసి వరదలతో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. వర్షాలతో ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.