సాధారణంగా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అవి ఎంత చిన్నవి అయినా సరే అధికార పార్టీ సీరియస్‌గానే తీసుకుంటుంది. చిన్న ఎన్నికలే కదా అని లైట్ తీసుకుంటే.. దాని ఎఫెక్ట్ భారీగానే ఉంటుందని పార్టీలు భావిస్తాయి. అందుకే ప్రతి ఎన్నికను సవాలుగా తీసుకుంటాయి. ఆఖరికి అవి వార్డ్ మెంబర్ ఎన్నికలయినా సరే.. అక్కడి గెలుపోటములు పార్టీలను ప్రభావితం చేస్తాయి. అందుకే ఎంత చిన్న ఎన్నిక వచ్చినా సరే.. అధికార, విపక్ష పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాలు చూసి.. వైసీపీ నేతలు తలలు పట్టుకుంటూంటే.. టీడీపీ నాయకులు మాత్రం విజయ గర్వంతో జెండాలు ఎగరేసి.. మిఠాయిలు పంచుకుంటున్నారు. ఈ ఫలితాల నేపథ్యంలో హోం మంత్రి తానేటి వనిత పని తీరుపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
తాజాగా జరిగిన కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్లోనూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ హోం మంత్రి తానేటి వనిత ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఇలాంటి ఫలితాలు వెలువడటం అంటే వైసీపీకి సిగ్గు చేటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అదికార పార్టీకి భయపడి.. విపక్షాలు పోటీ నుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవం అవుతాయి. కానీ కొవ్వూరులో అందుకు రివర్స్ సీన్ కనిపించింది. అధికార పార్టీ నేతలు పోటీకి దూరంగా ఉండటంతో.. టీడీపీ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తానేటి వనిత తీరు వల్లే ఈ ఫలితాలు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇటీవల తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో మొత్తం 12 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. అక్కడ భూమన కరుణాకరరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైసీపీలో అత్యంత కీలక నాయకుడు అయినప్పటికీ, అధికారం వచ్చినా ఎలాంటి పదవికి నోచుకోలేదు. కానీ ఏ ఎన్నిక జరిగినా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ, పార్టీని విజయ పథాన నడిపిస్తున్నారు. అయితే హోంమంత్రి వనిత ప్రాతినిథ్యం వహించే చోట కనీసం వైసీపీ అభ్యర్థులు పోటీ చేయకపోవడం వింతగా ఉంది. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వనితకు తెలుసా.. ఆమెకు నియోజవర్గం మీద ఎంతటి పట్టు ఉంది.. నియోజకవర్గంలోని గ్రూపు రాజకీయాలు ఏ స్థాయికి చేరుకున్నాయి వంటి సందేహాలు తెర మీదకు వస్తున్నాయి. సొంత నియోజకవర్గంలో కూడా పట్టు నిలుపుకోలేని దుస్థితిలో హోంమంత్రి వనిత ఉంటే… రానున్న ఎన్నికల్లో ఆమె ఏం సాధిస్తారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వైసీపీ గ్రూపు రాజకీయాలే కొంపముంచాయా..
1983 నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లోనూ ఈ బ్యాంకులో టీడీపీ తరపున పాలకవర్గం ఎన్నిక అవుతోంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా.. అధికార పార్టే విజయం సాధిస్తోంది. అదే విధంగా కొవ్వూరు కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల వేళ కూడా అలానే కాన్‌సన్‌ట్రేషన్ చేస్తే.. ఫలితం ఇలా ఉండేది కాదు అంటున్నారు విశ్లేషకులు. అంతేకాక ఇక్కడి వైసీపీ నేతలు కొందరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణమాల పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీలో చోటు చేసుకుంటున్న గ్రూపు రాజకీయాలతో టీడీపీ లాభపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తానేటి వనితకు నియోజకవర్గంపై ఏమాత్రం పట్టులేదని.. ఆమె అంత బలంగా జనాల్లోకి చొచ్చుకెళ్లలేరని.. వాటన్నింటి ఎఫెక్టే ఇప్పుడీ ఫలితాలు అంటున్నారు విశ్లేషకులు.
అయితే ఈ ఫలితాల మీద వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది.. కనీసం అభ్యర్థులను పోటీలో నిలబెట్టే పరిస్థితి కరువయ్యిందంటే.. స్థానిక నాయకులు ఏం చేస్తున్నారు.. ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు మధ్య ఎలాంటి విబేధాలున్నాయి.. నియోజకవర్గ బాధ్యతలను వేరే వారికి అప్పగించాలా అనే అంశాలపై అధిష్టానం దృష్టి కేంద్రీకరించినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. మరి ఈ ఫలితాలను వైసీపీ ఎలా తీసుకుంటుంది.. తర్వాతి చర్యలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.