చావు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను జరుపుకుంటారు. ఫ్రెండ్ షిప్ డే రోజు దేశ విదేశాల్లో ఉన్న తమ స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పుకుంటారు.. కొంతమంది కానుకలు ఇస్తూ, ఫ్రెండ్ షిబ్ బ్యాండ్స్ కట్టుకొని విందు.. వినోదాలు చేసుకుంటారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ సంతోషాల్లో మునిగిపోతే.. తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ వార్త తెలిసి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్నేహితుల దినోత్సవం రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద కారు అదుపు తప్పడంతో బ్రిడ్జీపై నుంచి కాలువలోకి దూసుకువెళ్లింది. ఏపీ 39 హెచ్ఆర్ 0907 నెంబర్ గల కారు ఏజెన్సీ మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. జిల్లాకు చెందిన 10 మంది స్నేహితులు నేడు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రెండు కార్లలో అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారజామున బురుగుపూడి వద్ద ఓ కారు అదుపు తప్పి నేరుగా కాల్వలోకి దూసుకువెళింది.
ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలు అయ్యాయి.. వీరిని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఉదయ్ కిరణ్, హర్ష వర్థన్, హేమంత్ గా గుర్తించారు. చనిపోయిన యువకులు ఏలూరు లోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రెండ్ షిప్ డే రోజు ఎంతో సంతోషంగా గడపాలనుకున్న స్నేహితులు అర్థాంతరంగా కన్నుమూయడంతో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి.