రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు. శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరనే అపోహలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. కరోనా కష్టకాలంలో రక్తదాతలు ముందుకొస్తున్నారు. అయితే వారందరినీ కలిపే ఓ వారధిగా, వారికో ప్లాట్ ఫాం కల్పించాలని ఆలోచించింది ఓ అమ్మాయి. రియాగుప్తా చెన్నై చెట్టినాడు అకాడెమీ ఆఫ్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌లో మూడో ఏడాది చదువుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్‌మీడియా ద్వారా తెలిసినవాళ్లకు కొందరికి బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాన్ని అందేలా సాయం చేసేది.
ఆ సమయంలో రక్తదాతల కోసం చాలా అభ్యర్థనలు వెల్లువెత్తడం గుర్తించింది. ఇందుకు తన వంతు పరిష్కారం చూపించాలనుకుంది. ‘‘టిండర్’ యాప్ ద్వారా ఓ స్నేహితుడికి ప్లాస్మా డోనర్ దొరికాడని తెలిసింది. వెంటనే ‘బ్లడ్ డోనర్ కనెక్ట్’ పేరుతో…ఓ యాప్ తయారు చేసి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసింది . వారంలోపే వందమంది దాతలు మా యాప్‌లో నమోదు చేసుకున్నారు. చెన్నైలోని ఎగ్మూరు పిల్లల ఆసుపత్రి, మెటర్నిటీ ఆసుపత్రి, అడయారు క్యాన్సర్ ఆసుపత్రుల వారికి అత్యవసరానికి యాప్‌లో ఉన్న దాతల వివరాలతో మ్యాచ్ చేసి సమాచారం ఇవ్వడం మొదలుపెట్టింది.
దాతలు ఆయా ఆసుపత్రులకు చేరుకుని సాయం అందించారు. యాప్ గురించి తెలుసుకున్న రెడ్ క్రాస్ ఇండియా, చెన్నై ట్రైకలర్ వంటి ఎన్జీవోలు దాతల కోసం సంప్రదిస్తున్నారు. రోజూ కనీసం పదిమందికైనా మా ద్వారా రక్తాన్ని రియాగుప్తా అందించగలుగుతోంది. ఇటీవల ఒక అరుదైన బ్లడ్‌గ్రూపు రక్తాన్నివ్వడానికి దాతలు చెన్నై నుంచి తిరుచ్చి, పుదుచ్చేరి వెళ్లివచ్చారు. రియా త్వరలో ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉంది. ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా ఆమెనీ ఆమె క్రియేట్ చేసిన యాప్ ద్వారా బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళని మనమూ అభినందిద్దాం.