ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది.
భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టీకాల కోసం తనపై ఒత్తిడి పెరిగిందని వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశానికి తొలి టీకాను అందించిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా ప్రకటించడం విశేషం. దేశంలో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి టీకా కోసం డిమాండ్ చేస్తూ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఆ ఒత్తిడిని అధిగమించడానికే లండన్‌లోని తన భార్యా పిల్లల దగ్గరకు వచ్చానని తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ది టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు.
యూకేకి వెళ్లడంలో వ్యాపారపరమైన కారణాలు కూడా ఉన్నాయని తెలిపారు. వ్యాక్సిన్ తయారీని భారత్ వెలుపల కూడా చేపట్టేందుకు యోచిస్తున్నామని వెల్లడించారు. దీనిపై రానున్న కొన్ని రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపారు. పరిస్థితులు ఈ స్థాయికి దిగజారుతాయని చివరకు దేవుడు కూడా అంచనా వేసి ఉండరన్నారు. ఇక కొవిషీల్డ్ టీకా ధరలపై మాట్లాడుతూ.. ప్రపంచంలో కొవిషీల్డ్ కంటే చౌకైన వ్యాక్సిన్ మరొకటి లేదని అభిప్రాయపడ్డారు.