ఈ రోజుల్లో మార్కెట్లో ప్రతి పదార్థం కల్తీ అవుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కల్తీ దందా కొనసాగుతూ.. మనుషుల ప్రాణాలను హరిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా WHO హెచ్చరికలు జారీ చేసింది.
సాధారణంగా ఆరోగ్య రీత్యా పిల్లలకు పేరెంట్స్ శ్రద్ధ తీసుకుంటారు. పౌష్టిక ఆహారం అందించి వారిని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తాం. చిన్న చిన్న కారణాలచేత కూడా పిల్లలు జలుబు, జ్వరం భారిన పడుతుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకుని వారిని కాపాడుకోవాలి. అయితే పిల్లలకు బాగాలేనపుడు ఏదిపిడితే అది వారికి అందిస్తే అనారోగ్యం తీవ్రం అయ్యే ప్రమాదం ఉంటుంది. వారిపట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతి రోజు మనం వాడే పాలు, నూనె, అల్లంవెల్లుల్లి పేస్ట్, మసాలాలు, పసుపు మొదలైనవి అన్నీ కల్తీయే. వీటితోపాటుగా మార్కెట్లో పిల్లలకు సురక్షితం కాని సిరప్ కూడా వస్తుంది. తల్లిదండ్రులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అంటోంది డబ్ల్యూహెచ్ఓ. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత్‌లో తయారై ఇరాక్‌లో సేల్ అవుతున్న మరో నాసిరకం సిరప్‌పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ జలుబుకు‘కోల్డ్ అవుట్’ సిరప్ వాడడం పిల్లలకు సురక్షితం కాదని తెలిపింది. గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన మెడికల్ అలర్ట్‌లో ఈ విషయాన్ని WHO వెల్లడించింది. ఈ సిరప్ చెన్నైకి చెందిన ఫోర్ట్స్ లాబొరేటరీస్ మానుఫ్యాక్చర్ చేయగా, ఇరాక్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలిపింది. దీనిని వాడడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఒక్కోసారి చిన్నారులు మరణించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.
‘కోల్డ్ అవుట్’ సిరప్‌ను ల్యాబ్ టెస్ట్ చేయించగా ఇందులో డైథలీన్ గ్లైకాల్ 0.25%, ఇథిలీన్ గ్లైకాల్ 2.1% కలుషితాలు ఉన్నట్లుగా తేలింది. ఇది ఉపయోగించాల్సిన పర్సంటేజ్ కంటే 0.10% అధికంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది పసిపిల్లల ఆరోగ్యానికి హానికరం అని సూచించింది. అయితే ఇప్పటివరకు ఇరాక్ అధికారులు ‘కోల్డ్ అవుట్’ సిరప్‌కు సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు. గత ఏడాది గాంబియా, ఉజ్జెకిస్తాన్‌లలో పిల్లల మరణాలకు భారత్ తయారు చేసిన దగ్గు సిరప్‌లకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు మాత్రం వచ్చాయి.