క్రెడిట్ కార్డు.. ఈ మధ్యకాలంలో వీటి వినియోగదారులు చాలానే పెరిగారు. క్రెడిట్ కార్డు వినియోగించడం వల్ల ఏంటి లాభం? అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. అయితే ఆర్థిక నిపుణులు సైతం సరైన పద్ధతిలో క్రెడిట్ కార్డు వినియోగిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతుంటారు. అంతేకాకుండా మీరు వాడుకున్న బిల్లులు తిరిగి చెల్లించేందుకు 40 రోజుల సమయం కూడా ఉంటుంది. అంటే మీకు 40 రోజులపాటు వడ్డీ లేని రుణం అందిందనమాట. అందుకే క్రెడిట్ కార్డుల వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. అలా లక్షల్లో ఉన్న వినియోగదారులు, మర్చంట్లను దృష్టిలో ఉంచుకుని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వల్ల లక్షల మంది వినియోగదారులు లాభ పడటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
భారత మార్కెట్‌లో చెల్లింపుల విషయంలో ఇప్పటివరకు చాలా మార్పులు వచ్చాయి. అంతా యూపీఐ చెల్లింపులకు బాగా అలవాటు పడిపోయారు. కాకపోతే గతంలో యూపీఐకి మీ డెబిట్ కార్డు లేదా బ్యాంక్ అకౌంట్‌ని అనుసంధానం చేసి చెల్లింపులు చేసేవారు. క్రెడిట్ కార్డును జత చేసే అవకాశం లేదు. కానీ, ఇప్పుడు మీ క్రెడిట్ కార్డును కూడా యూపీఐకి అనుసంధానం చేసి చెల్లింపులు చేయవచ్చు. అయితే దానికి మాత్రం అదనపు ఛార్జీలు పడతాయంటూ ప్రచారం జరిగింది. ఆ విషయంపై తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఇక నుంచి రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు అనమాట. భారతదేశంలో క్రెడిట్ కార్డు వినియోగాన్ని పెంచేందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది. కాకపోతే అందుకు ఒక షరతు పెట్టింది. అదేంటంటే.. రూ.2 వేలలోపు లావాదేవీలకు మాత్రమే జీరో మర్చంట్ ఫీజ్ ఉంటుందని వెల్లడించారు. రూ.2 వేలు దాటిన లావాదేవీలకు మాత్రం ఎప్పటిలాగానే ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇటీవలే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్.. క్రెడిట్ కార్డులతో సైతం యూపీఐ లావాదేవీలు చేయచ్చని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో క్రెడిట్ కార్డుల వినియోగం ఐదింతలు పెరుగుతుందని అంచనా వేశారు. కాకాపోతే ప్రస్తుతానికి రూపే క్రెడిట్ కార్డులకు మాత్రమే ఆ అవకాశాన్ని కల్పించారు. నాలుగేళ్లుగా బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరిన్ని రూపే కార్డులను వినియోగదారులకు అందజేస్తోంది. పంబాజ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డులతో యూపీఐ చెల్లింపుల సేవలను ప్రారంభించేశాయి కూడా. ఎన్‌పీసీఐ తీసుకు ఈ నిర్ణయం వినియోగదారులకు ఊరటనివ్వడమే కాకుండా.. యూపీఐ చెల్లింపులు సైతం మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు.