ఇటీవల ఆర్బీఐ రూ.2000 వేల నోటు చెలామణి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక రెండు వేల నోటును సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఎపుడైతే రూ.2000 చెలామణి రద్దు అయ్యిందో.. ఇదే బాటలో రూ.500 నోటు చెలామణి కూడా రద్దు అవుతుందని తెగ వార్తలు వచ్చాయి.
ఈ ఏడాది మే మాసంలో రూ.2000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులకు వెళ్లి రూ.2000 నోట్లు మార్చుకోవచ్చని, లేదా ఖాతాల్లో జమ చేయవచ్చని ఆర్బీఐ తెలిపింది. అప్పటి వరకు రూ.2000 నోటు చెల్లుబాటులోనే ఉంటుందని, లావాదేవీల కోసం రూ. 2000 నోట్లను తీసుకోవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రజలు బ్యాంకుల్లో రెండువేల నోట్లు జమచేసేందుకు క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి.. ఈ సందర్భంగా రూ. 500 నోట్ల రద్దు, రూ. 1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ను అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రూ.500 డిమోనిటైజేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
ఆర్బీఐ రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత రూ.500 నోటు కూడా రద్దు చేస్తారని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.500 నోట్లు రద్దు చేసి దాని స్థానింలో రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెడతారంటూ తెగ వార్తలు వచ్చాయి. ఆర్బీఐ సమావేశం జరిగిన తర్వాత ఈ తరహా నోట్ల రద్దుకు సంబందించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై పూర్తి స్పష్టతనిచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ సమాధానం ఇస్తూ.. ఇప్పడు కరెన్సీ నోట్లలో అత్యధిక విలువ ఉన్న నోట్లను రద్దు చేయడం అనే వార్తలు ఉత్త పుకార్లు మాత్రమే అని అన్నారు. ప్రస్తుతానికి రూ.500 నోట్లను రద్దు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశ పెట్టే యోచన ఉందా అనే ప్రశ్నపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు పంకజ్ చౌదరీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఇక రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. నగదు ఉపసంహరణ అనేది ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా, ఆర్థిక లావాదేవీల్లో అంతరాయాన్ని నివారించడం కోసం కరెన్సీ విధానాన్ని తీసుకువచ్చారు. కాలానుగుణంగా వాటిలో ఎన్నో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రూ.2000 నోట్లను ఉపసంహరణ తర్వాత ప్రజల అవసారాలు తీర్చడానికి దేశవ్యాప్తంగా ఇతర డినామినేషన్ల నోటు రూ.500 సరిపడా ఉందని అన్నారు మంత్రి. అలాగే ఆర్థిక వ్యవస్థలో రూ.1000 నోట్లను మళ్లీ ప్రవేశ పెట్టే యోచన లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చారు. అలాగే రూ.2000 నోట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలని.. ఆ తేదీని పొడిగించే యోచనలో కేంద్రం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సరిపడినంత బ్యాంక్ నోట్ల బఫర్ స్టాక్ ఉందని.. అన్నారు మంత్రి పంకజ్ చౌదరీ. మొత్తానికి రూ.1000 నోట్లను చలామణిలోకి తీసుకువచ్చే యోచనలో కేంద్రం లేదని అర్థమవుతుంది.