ప్రస్తుతం మార్కెట్‌లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గృహోపకరణాల మొదలు ఎలక్ట్రానిక్స్, టోమొబైల్స్ మీద కూడా అదిరిపోయే ఆఫర్లు అందిస్తున్నారు. చాలా మందికి కారు కొనాలి అనే కల, కోరిక ఉంటుంది. కానీ, కొందరు బడ్జెట్‌లో మంచి ఆఫర్లలో మాత్రమే కారు కొనాలని చూస్తుంటారు. అలాంటి వారికి ఇది సరైన సమయం అనే చెప్పాలి. దసరా, దీపావళి సందర్భంగా కార్ల మీద కూడా కళ్లు చెదిరే ఆఫర్లు, డిస్కౌంట్లు, ఎక్స్ ఛేంజ్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ పండగ సీజన్లో మీరు కారు కొనాలి అనుకుంటే మాత్రం ఈ 5 విషయాలను తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మీకు కచ్చితంగా లాభం జరగచ్చు. అసలు ఆ 5 విషయాలు ఏంటి? దానివల్ల వినియోగదారులకు వచ్చే ప్రయోజనం ఏంటో చూద్దాం.
కార్ల అమ్మకంలో ఎన్నో రకాల ఆఫర్లు ఉంటాయి. వాటిలో మొదటిగా డిస్కౌంట్ల గురించి చెప్పుకోవాలి. చాలా కంపెనీలు డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్స్ తో పాటుగా కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తుంటాయి. వాటికి అదనంగా ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు కూడా నడుస్తుంటాయి. వీటి ద్వారా మీరు గరిష్టంగా రూ.50 వేల వరకు లాభం పొందవచ్చు. ముందుగా మీకు అందనున్న డిస్కౌంట్లు, ఆఫర్లు వివరాలు తెలుసుకోవాలి. ఇంక రెండోది డీలర్ ఆఫర్లు కూడా ఉంటాయి. చాలా మంది డీలర్లు కంపెనీ ఆఫర్ కాకుండా ప్రత్యేకంగా డీలర్ ఆఫర్ ని కూడా అందిస్తుంటారు. మీకు అందుబాటులో ఉన్న వారిలో ఏ డీలర్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నాడో తెలుసుకంటే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.
ఇంక మూడోది కారు కొనే ముందు మీరు దాని మానుఫాక్చరింగ్ ఇయర్ తెలుసుకోవాలి. కొందరు తమ దగ్గర స్టాక్ ఉన్న కారుని కూడా కొత్తదానిలా అమ్ముతుంటారు. దాని వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ ఉండదులెండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సమయం నుంచే ప్రభుత్వం ఆ కారు లైఫ్ ని లెక్కిస్తుంది. అయితే కొన్నిసార్లు యూజ్డ్ మాన్యుఫాక్టర్ కార్లపై అధిక డిస్కౌంట్లు ఇస్తుంటారు. అది తెలుసుకుంటే సాధారణంగా కంటే అతి తక్కువ ధరకు కారును పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి కారు తీసుకోవాలనుకుంటే అదనపు ప్రయోజనాలను కూడా డిమాండ్ చేయవచ్చు. కారు కొనే సమయంలో ముఖ్యంగా ఇన్సూరెన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
కంపెనీ వారు ఎలాంటి ఇన్సురెన్స్ అందిస్తున్నారు. అంతకన్నా తక్కువలో వేరే వాళ్లు బీమా ఆఫర్ చేస్తున్నారేమో తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుంచి మీరు అదనపు డిస్కౌంట్ ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కారును నేరుగా క్యాష్ కట్టి తీసుకోవడం కాకుండా చాలా మంది లోన్ లో తీసుకుంటారు. అలా తీసుకునే సమయంలో మీరు ఏ ఫైనాన్స్ ని ఎంపిక చేసుకుంటున్నారు? ఆ ఫైనాన్స్ కి ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు. షార్ట్ టర్మ్ లోనా, షార్ట్ టర్మ్ లోనా అనేది చూసుకోవాలి. అంతేకాకుండా డౌన్ పేమెంట్ ని బట్టి కూడా మీరు కట్టే వడ్డీ తగ్గడం, పెరగడం ఆధారపడి ఉంటుంది. మరి.. ఈ పండగ సీజన్లో కొత్త కారు కొనాలనుకుంటే మాత్రం ఈ 5 విషయాలను తప్పకుండా తెలుసుకుని, కంపేర్ చేసుకుని కారు కొంటే మీరు కచ్చితంగా లాభపడతారు.