కూలి పని చేసుకునేవారు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఇష్టపడరు. అప్పోసప్పో చేసి మరి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకే పంపుతారు. అందుకు వారు చెప్పే కారణం.. సర్కారీ బడుల్లో సరిగా చెప్పరని. అందుకు తగ్గట్టుగానే గవర్నమెంట్ టీచర్ కొలువు చేసే వారు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకే పంపుతారు. కానీ ఈ కలెక్టరమ్మ మాత్రం వీరికి భిన్నం. జిల్లా మొత్తానికి అధికారి హోదాలో ఉన్న కలెక్టర్ తన కుమార్తెను మాత్రం ప్రభుత్వ అంగన్వాడి పాఠశాలలో చేర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఆమే …శిల్పా ప్రభాకర్ సతీష్. 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో తన కుమార్తెను అందరిలానే ప్రైవేట్ ప్లే స్కూల్‌కు పంపించకుండా తన ఇంటికి సమీపంలోని అంగన్‌వాడి కేంద్రానికి పంపిస్తున్నారు. అంతేకాకుండా, ప్రతిరోజూ తన కుమార్తెను అంగన్‌వాడీ కేంద్రానికి స్వయంగా తీసుకెళ్ళేవారు. ఆ సమయంలో ఆ కేంద్రానికి వచ్చే ఇతర విద్యార్థుల తల్లిదండ్రులతో ఆమె సాధారణ మహిళగా కలిసిపోయి, వారి కష్టనష్టాలు, సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేవారు. ఈ విషయం గురించి శిల్ప మాట్లాడుతూ ‘నా కూతురు నలుగురితో కలిసిమెలసి ఉండాలని భావిస్తున్నాను. ఈ ఆర్థిక, సామాజిక బేధాలు తనపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ చేర్చాను. ఇవేకాక తాను చాలా త్వరగా తమిళం నేర్చుకోవాలని భావించి ఇక్కడకు పంపుతున్నాను’ అన్నారు.