ప్రేమకు అడ్డు చెప్తాడని భావించిన కూతురు అతడిపై దాడి చేయించింది. ప్రియుడి మోజులో పడి ఈ దారుణానికి ఒడిగట్టింది. కన్న కూతురే తండ్రిపై దాడి చేయించడంతో అందరు షాక్ అయ్యారు.
ప్రతి తండ్రి తన కూతుర్ని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటాడు. కూతురుకు ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కూతురు భవిష్యత్ కోసం నిరంతరం కష్టపడుతుంటాడు. ఇంతటి బాధ్యతగల తండ్రుల పట్ల కొందరు కూతుర్లు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ మోజులో పడి తండ్రి గుండెలపై మానని గాయాన్ని చేస్తున్నారు కూతుర్లు. మరి కొందరైతే ప్రియుడి కోసం ఏకంగా తండ్రిని అంతమొందించడానికి వెనకాడట్లేదు. ఇలాగే అక్కడ ఓ కూతురు ప్రియుడి మత్తులో మునిగితేలుతూ కన్న తండ్రిని మట్టుబెట్టేందుకు పథకం వేసింది. రూ. 60 వేల సుపారీ ఇచ్చి దారుణానికి పాల్పడింది. ఆ వివరాలు మీకోసం..
తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భావించిన కూతురు తండ్రిపై దాడిచేయించింది. ప్రియుడితో కలిసి ఈ కుట్రకు తెరలేపింది. దీనికోసం రూ. 60 వేల సుపారీ ఇచ్చి 4 వ్యక్తులను ఏర్పాటు చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోలాపూర్ జిల్లాలోని మధ తాలుకాకు చెందిన మహేంద్ర షా పేరున్న వ్యాపార వేత్త. ఇతడి గారాల కూతురు పేరు సాక్షి. ఈమె చైతన్య అనే యువకుడిని ప్రేమించింది. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమకు తండ్రి అడ్డుచెప్తాడని భావించిన కూతురు తండ్రిని అంతమొందించేందుకు ప్లాన్ వేసింది. ఈ పథకంలో భాగంగానే సాక్షి పూణేకు వెళ్లి రాత్రి తిరిగి మధకు వచ్చింది. తనను తీసుకెళ్లాల్సిందిగా తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.
వెంటనే తన కూతుర్ని తీసుకెళ్లేందుకు కారులో వచ్చిన మహేంద్ర షా కూతుర్ని ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఇక అప్పుడు అసలు కథ మొదలుపెట్టింది. మార్గమధ్యంలో టాయిలెట్ వస్తుందని వాడచివాడి గ్రామ సమీపంలో కారును ఆపివేసింది. అప్పటికే వీరి కారును అనుసరిస్తున్న నలుగురు వ్యక్తులు మహేంద్ర షాపై తీవ్రంగా దాడి చేసి కాళ్లు విరగొట్టి నిందితులు పారిపోయారు. తీవ్ర గాయాలతో హాహాకారాలు చేస్తున్న మహేంద్రను వాడచివాడి గ్రామంలోని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారి విచారణలో మహేంద్ర షా కూతురు సాక్షి ప్రధాన నిందితురాలిగా తేలడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ కుట్రలో భాగమైన ఆమె ప్రియుడ్ని సుపారీ తీసుకుని దాడిచేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.