డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై ప్రతీకారం తీర్చుకుంటా అని మంగమ్మ శపథం చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద చేష్టలతో వివాదాల్లో ఇరుక్కునే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన అనంతరం భారత్ పై ప్రతీకార పన్ను వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్ బిజినెస్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హార్లీ డేవిడ్ సన్ లాంటి బైక్ లపై ఇండియా వంద శాతం, 150, 200 శాతం పన్ను విధిస్తుందని ఆయన మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని.. ఇలా అయితే అమెరికన్ కంపెనీలు ఎలా వ్యాపారం చేయగలవని ప్రశ్నించారు. అమెరికన్ కంపెనీకి ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని భారత్ కోరుకుంటుందని.. అప్పుడైతేనే ఎలాంటి పన్ను భారం ఉండదని ఇండియా భావిస్తుందని ట్రంప్ అన్నారు.
అందుకే అమెరికన్ వస్తువులపై ఇండియా భారీగా పన్ను విధిస్తుందని మండిపడ్డారు. అయితే భారత్ లో తయారైన బైకులపై అమెరికా ఎలాంటి పన్ను విధించడం లేదని.. కానీ అమెరికా చేసిన హార్లీ డేవిడ్ సన్ బైకులను భారత్ లో అమ్మాలంటే మాత్రం భారీగా పన్ను కట్టాల్సి వస్తుందని వాపోయారు. భారీ పన్ను కారణంగా భారత్ లో ఆ ఈ బైకులను ఎవరూ కొనడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన వస్తువులపై భారతదేశం అధిక పన్నులు వసూలు చేస్తున్నప్పుడు.. ఇండియా వస్తువులపై మనం టారిఫ్ విధించకూడదా? అని ప్రశ్నించారు. ఇండియా 200 శాతం పన్ను విధిస్తున్నప్పుడు.. అమెరికా 100 శాతం, 50 శాతం, 20 శాతం కూడా పన్ను వేయొద్దా అంటూ ట్రంప్ ప్రశ్నించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే భారత్ వస్తువులపై ప్రతీకార పన్ను వేస్తానని అన్నారు.