ఒలింపిక్స్ మీద కూడా కోరలు చాచిన కరోనా!??

కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడినట్లుగానే క్రీడా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. చాలా వరకు క్రీడలు కరోనా నేపథ్యంలో వాయిదా పడడమో, రద్దు కావడమో జరిగింది. ఇక క్రికెట్‌ మ్యాచ్‌లు కూడా ప్రేక్షకులు లేకుండా అనుమతులిస్తూ నడిపించేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒలింపిక్స్‌ కూడా పలు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు చెందిన ఆటగాళ్లు, పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరు అవుతారనే ఉద్దేశంతో ఈ క్రీడలను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈసారి ఒలింపిక్స్‌ క్రీడలను జపాన్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. జపాన్‌లో కరోనా తన పంజాను విసురుతోంది. ఆ దేశంలో ప్రస్తుతం కరోనా నాలుగో వేవ్‌ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ నిర్వహణపై మీ అభిప్రాయం ఏమిటంటూ క్యోడో అనే న్యూస్‌ ఏజెన్సీ ఏప్రిల్‌ 10, 12 తేదీల్లో జపాన్‌ వాసులను ప్రశ్నిస్తూ ఓ సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వేలో సుమారు 70 శాతం మంది టోక్యో ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయడమో… లేక మరోసారి వాయిదా వేయాలంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక 39.2 శాతం మంది ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయడాన్ని సమర్థించగా 32.8 శాతం ప్రజలు మరోసారి వాయిదా వేయాలని కోరుకున్నారు.

oos5vbbp8rxk74j06dzw

క్రీడలకు ఆతిథ్యమిచ్చే టోక్యో, ఒసకా, క్యోటో, హ్యోగో ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ మే 11 వరకు ఎమర్జన్సీ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించాలా? వద్దా? అనే విషయంపై కొద్ది రోజులుగా జపాన్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ నెలలో ఆ విషయంపై ప్రకటన చేయాలనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని వచ్చే నెలకు వాయిదా వేశారు.