మన కోర్కెలు తీర్చేందుకు, తీరిన కోర్కెలు మొక్కు రూపంలో చెల్లించేందుకు గుళ్లు, గోపురాలకు వెళుతుంటాం. ఆయురారోగ్య,ఐశ్వర్యం అభివృద్ది చెందాలని కోరుకుంటాం. లేదా బిడ్డల చదువులు, కుటుంబ సమస్యలు తీరాలని మొక్కుతాం. అలాగే కొన్ని కోర్కెలకు కూడా ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి
మన కోర్కెలు తీర్చేందుకు, తీరిన కోర్కెలు మొక్కు రూపంలో చెల్లించేందుకు గుళ్లు, గోపురాలకు వెళుతుంటాం. ఆయురారోగ్య, ఐశ్వర్యం అభివృద్ది చెందాలని కోరుకుంటాం. లేదా బిడ్డల చదువులు, కుటుంబ సమస్యలు తీరాలని మొక్కుతాం. అలాగే కొన్ని కోర్కెలకు కూడా ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను వీసాల దేవుడిగా పిలుస్తారు. అలాగే కృష్ణా జిల్లా ఉయ్యూరులోని వీరమ్మ తల్లికి కూడా ఇదే విధమైన దేవతగా పేరుంది. ఇలా ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే దేవాలయం కాస్త భిన్నం. ఇదొక విడాకుల దేవాలయం.
పెళ్లిళ్లు చేసుకునేందుకు గుడులు ఉన్నాయి కానీ..విడిపోయేందుకు దేవాలయం ఉందని మీకు తెలుసా.? విడాకుల దేవాలయమా అదెక్కడా అని అనుకుంటున్నారా..? జపాన్‌లో ఉంది. దాని పేరు మాట్సుగోకా టోకోజీ దేవాలయం. ఇది జపాన్‌లో చారిత్రాత్మక బౌద్ద దేవాలయం కూడా. భర్తతో విసిగి వేశారిపోయిన మహిళలు ఈ గుడిలో ఆశ్రయాన్ని పొందుతుంటారు. 600 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ గుడిని 1285లో బౌద్ధ సన్యాసిని కకుసన్ షిడో స్థాపించారు. ఆ రోజుల్లో గృహ హింసకు గురైన మహిళలకు ఇక్కడకు వచ్చి ఆశ్రయం పొందేవారు. తొలుత ఈ గుడిలో నిస్సహాయులైన మహిళలకు ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత ఆలయం మహిళలకు స్వర్గధామంగా మారిపోయింది.
స్త్రీలకు రక్షణ కల్పించి.. వివాహ బంధం నుండి బయట పడేందుకు విడాకుల ధృవపత్రాలను అందించేవారు. ఈ సర్టిఫికేట్ వారి వివాహల నుండి చట్టపరమైన స్వేచ్ఛగా ఉండే హక్కును ప్రసాదించేది. అందుకే దీనికి విడాకుల దేవాయలం (డివోర్స్ టెంపుల్) అని పేరు వచ్చింది. దాని నిస్వార్థ, దయతో కూడిన సేవ కారణంగా, ప్రజలు ఆలయాన్ని కాకేకోమి-డేరా, విడాకుల దేవాలయం, మహిళల దేవాలయం అంటూ సంబోధించడం మొదలు పెట్టారు. ఈ ఆలయం ఉంచిన శిల్పాలను చూస్తే ప్రేమలో పడిపోవడం ఖాయం. అందమైన ఉద్యానవనం, సుందరమైన చెక్కతో కూడిన కళాకృతులు కొలువుదీరి ఉన్నాయి. నాటి మహిళల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపే పలు ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. దీనికి తోడు ఇది ఒక బౌద్ధమందిరంగానూ పేరొందింది. బౌద్ధ మతానికి సంబంధించిన ధార్మిక సమావేశాలు ఇక్కడ జరుగుతుండేవి. ఇప్పటికీ ఆలయంలోని బౌద్ధ బిక్షువులు, నన్‌లు ఇక్కడికి వచ్చేవారికి మార్గదర్శనం చేస్తుంటారు.