వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే మొదలైంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పురావస్తు శాఖ మసీదు ఆవరణలో శుక్రవారం ఉదయమే సర్వే మొదలుపెట్టింది.
ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందో, ఏమవుతుందోననే ఆందోళన మొదలైంది. సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో శుక్రవారం పురావస్తు శాఖ సర్వే మొదలెట్టింది. 41 మంది సభ్యుల బృందం ఇవాళ మసీదు ప్రాంగణానికి చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సర్వ్ మొదలైంది. మరోవైపు అలహాబాద్ హైకోర్టు జ్ఞానవాపి మసీదులో సర్వేకు అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇవాళ సుప్రీం కోర్టు దీనిపై విచారణ జరపనుంది. మొత్తానికి జ్ఞానవాపి మసీదులో సర్వే అంశం దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారి తీసింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే?
నలుగురు హిందూ మహిళలు.. జ్ఞానవాపి మసీదు హిందూ దేవాలయం అని వారణాసి కోర్టును ఆశ్రయించారు. మొఘలుల కాలంలో మసీదు స్థానంలో హిందూ దేవాలయం ఉండేదని.. దాన్ని కూల్చి మసీదు నిర్మించారని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను విచారించిన వారణాసి కోర్టు సర్వే చేపట్టాలని జూలై 21న ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో జూలై 24న పురావస్తు శాఖ సర్వే ప్రారంభించింది. దీనిపై మసీదు కమిటీ జూలై 25న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వే నిర్వహణపై జూలై 26 సాయంత్రం 5 గంటల వరకూ స్టే విధించింది. అదే సమయంలో వారణాసి కోర్టు తీర్పుపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించుకోవచ్చు అని వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే అని.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేస్తూ మసీదు కమిటీ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మళ్ళీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మరోవైపు తమ వాదనలు కూడా వినాల్సిందిగా హిందూ పిటిషనర్లు కేవియట్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే జ్ఞానవాపి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. అది మసీదు, శివాలయం కాదని.. అది ఒక బౌద్ధరామమని.. దీన్ని నిరూపించడానికి ఏఏఎస్ఐ సర్వే జరిపించాలని బౌద్ధగురువు గురు సుమిత్ రతన్ భాంటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.