ఏపీలో ముందస్తు ఎన్నికలు అన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. అధికార, విపక్ష పార్టీలు అందుకు తగ్గట్టుగా వ్యూహా రచన చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు చాలా సమయం ఉండగానే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేశారు. ఆ వివరాలు..
పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి పేరును ఖారారు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. పులివెందుల నియోజకవర్గం నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ మేరకు అభ్యర్థిని ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. పులివేందుల టీడీపీ నేతల అభిప్రాయాలను తీసుకుని, వారి సూచనల మేరకు ఇదే సమావేశంలోనే బీటెక్ రవిని పులివెందుల టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు.
ఆ నమ్మకంతోనే..
కడప జిల్లా, అందునా పులివెందలు అంటే వైఎస్ కుటుంబానికి కంచు కోట. అక్కడ టీడీపీ విజయం అంత తేలిక కాదు. గతంలో వైఎస్ జగన్ మీద పులివెందుల నుంచి టీడీపీ తరఫున సతీష్ రెడ్డి బరిలో నిలిచి.. ఓడిపోయారు. కానీ బీటెక్ రవి మాత్రం గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్ కుటుంబం మీద విజయం సాధించారు. 2017లో జరిగిన కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలో నిలిచిన.. బీటెక్ రవి.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిపై విజయం సాధించారు. పులివెందులలో టీడీపీకి ఇది చాలా మంచి ఫలితం అని చెప్పవచు. ఈ నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు, బీటెక్ రవిని ఈ సారి ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ పై పోటీకి నిల్పుతున్నారు.
ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తారో…
ఈ క్రమంలో గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన అనంతరం బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వైఎస్సార్ కుటుంబంపై ఇప్పటికే ఓసారి గెలిచానని, ఇప్పుడు వారిపై గెలవడం తనకు చాలా ఈజీ అని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబానికి చెక్ పెట్టేందుకు తన వద్ద వ్యూహాలు ఉన్నాయని, ఇప్పటికే ఓసారి వారి కుటుంబ సభ్యుడిని ఓడించినందున తాను గెలవడం చాలా ఈజీ అని చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతేకాక ఎమ్మెల్సీ అయిన బీటెక్ రవి పులివెందుల ఇన్‌చార్జ్‌గానూ కొనసాగుతున్నారు. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ని ఓడించడం కోసం బీటెక్ రవి ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తాడో చూడాలి అంటున్నారు కడప జనాలు. ఏది ఏమైనా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడపలో పోరు రసవత్తరంగా ఉండనుందనేది మాత్రం వాస్తవం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.