ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. విపక్షాలతో పాటు పలువురు సొంత పార్టీ నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారు. అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేపట్టారంటూ ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. త్వరలోనే ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి.. మాట్లాడతానని తెలిపారు. మరోవైపు ఈ కొత్త జిల్లాల అంశం నెల్లూరు జిల్లాలో నేతల మధ్య పంచాయతీ రాజేసింది. ఆ అంశంపై ఆనం రామనారయణ రెడ్డి, మాజీ సీఎం నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
ఆనం అసంతృప్తికి కారణమిది..
ఆనం కుటుంబం కొన్ని దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తుంది. ఆనం కుటుంబానికి నెల్లూరు రూరల్, నెల్లూరు టౌన్, ఆత్మకూరు నియోజకవర్గంలో బలం ఉంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆనం నెల్లూరు జిల్లాకే దూరమయ్యే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. వైసీపీలో ఈ మూడు నియోజకవర్గాల్లో కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేకపాటిని కాదని తిరిగి తనకు ఆత్మకూరు నియోజకవర్గం ఇస్తారన్న ఆశలేదు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు.
ప్రస్తుతం ఆనం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ నుంచి పోటీ చేయడం ఆయనకు ఇష్టం లేకపోయినా.. వెంకటగిరి కూడా నెల్లూరు జిల్లాలోనే ఉండటంతో.. పోటీ చేశారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాను శ్రీ బాలాజీ జిల్లాలోకి మారనున్నాయి. ఇదే జరిగితే.. ఆనం నెల్లూరు జిల్లాకు పూర్తిగా దూరమవుతారు. అందుకే ఈ మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ఆనం డిమాండ్ చేస్తున్నారు. 2009లో కూడా ఇలానే చేశారని.. దీని వెనక నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుటుంబం ఉందని ఆనం పరోక్షంగా విమర్శలు చేశారు.
నేదురుమిల్లి కౌంటర్..
ఆనం వ్యాఖ్యలకు నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీతి మాలిన రాజకీయాలు చేయవద్దని ఆనంను రాంకుమార్ రెడ్డి హెచ్చరించారు. తన తండ్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి లేకుంటే ఆనంకు రాజకీయ భవిష్యత్ ఉండేది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. దీనికి తిరిగి ఆనం కౌంటర్ ఇచ్చారు. రాజకీయ అనుభవం లేని వాళ్లు మాట్లాడే మాటలను తాను పెద్దగా పట్టించుకోనని, ఈ విషయాన్ని జగన్ వద్దనే తేల్చుకుంటానని చెప్పారు.
తగ్గేదేలే అంటున్న హైకమాండ్….
అయితే కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో హైకమాండ్ ఎవరి మాట వినేలా లేదు. తన నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్లాలని భావిస్తోన్నట్లు సమాచారం. మరోవైపు ఆనం అశాస్త్రీయంగా జిల్లాలను విభజిస్తే అధికార పార్టీకి రాజకీయ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీని అర్థం తాను జిల్లాల విభజనకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తానని పరోక్షంగా హెచ్చరించడమే అంటున్నారు విశ్లేషకులు.
మరోసారి వెంకటగిరి నుంచి పోటీ చేసే అవకాశం లేదని ఆనం రామనారాయణరెడ్డి తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలిసింది. పార్టీ మారైనా సరే ఆత్మకూరులో బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీలో ఆనంకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం, నెల్లూరు జిల్లాను వీడి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ఆనం రామనారాయణరెడ్డి ఈసారి ఖచ్చితంగా పార్టీ మారి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డి చేత ఆనంకు కౌంటర్ ఇప్పించి ఈ విషయంలో తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది అంటున్నారు నేతలు. మరి ఆనం జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. పార్టీ విడతారా లేదా చూడాలి అంటున్నారు కార్యకర్తలు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.