ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి.. ఏపీలో మాత్రం రాజకీయాలు ఇప్పటికే హీటెక్కాయి. ఓ వైపు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అటు ప్రతిపక్షాలు.. ఇటు అధికార పక్షం ఇరు వర్గాలు జోరు పెంచాయి. ఓ వైపు విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు గట్టిగా ప్రయత్నిస్తుండగా.. మరోవైపు అధికార పార్టీ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు గాను ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. ప్రజల యోగక్షేమాలు.. ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాల గురించి జనాలతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. గడిచిన నెల రోజుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యేల పని తీరుపై రిపోర్ట్ బహిర్గతం చేశారు. 175 నియోజకవర్గాల్లో కార్యక్రమం ఎన్ని రోజులు జరిగింది? ఎవరు ఎన్ని రోజులు గడప గడపకు ప్రోగ్రామ్ కు వెళ్లారనేది లెక్కలతో సహా వివరించారు.
ఈ లెక్కలన్ని బయటపెట్టిన సీఎం జగన్.. అనంతరం ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. అలిగినా, కోపం తెచ్చుకున్నా, బాధపడ్డా చేసేదేమీ లేదని.. గెలిచే వారికే టిక్కెట్లు ఇచ్చేది తేల్చి చెప్పారు జగన్. ఇంకా సమయం ఉందని, జాగ్రత్త పడాలని హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే పోస్టింగ్ ఊస్టింగే అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు కూడా కార్యక్రమం నిర్వహించని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిల పేర్లను సమీక్షలో ప్రస్తావించారు సీఎం జగన్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 58 రోజులు జరిగింది. 22మంది ఎమ్మెల్యేలు పది రోజుల లోపు కార్యక్రమంలో పాల్గోనగా.. మరో ఆరుగురు కేవలం 5 రోజులు మాత్రమే ప్రజల్లోకి వెళ్లారని చెప్పారు జగన్. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు మాత్రమే ఎక్కువ రోజులు కార్యక్రమం నిర్వహించారని చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం పనిచేసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను. నా మీద అలిగినా ఫరవా లేదు. పని చేయని వాళ్లకు మాత్రం టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు. నాతో పాటు ఎమ్మెల్యేలు కలిసి పనిచేస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం ఉంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొందరు సీరియస్‌గా తీసుకోవడం లేదు. నేను చేసే పని నేను సక్రమంగా చేస్తున్నాను. ప్రకటించని ప్రకారం ప్రతి నెల బటన్ నొక్కి ప్రజల అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నాం. ఇక మిగతా పని మీ చేతుల్లో ఉంది. మీరు సహకరించకపోతే.. నష్టపోయిది మనమే. పని చేయని వారికి టికెట్లు ఇచ్చేది లేదు. నేను చేసేది నేను చేస్తాను.. మీరు చేసేది మీరు చేయ్యాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది” అంటూ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్ట్రాంగ్ క్లాస్ తీసుకున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.