తిరుమల- కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ నలుమూల నుంచి, ప్రపంచ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి విచ్చేస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులతో తిరుమల కలకలలాడుతూ ఉంటుంది.
కరోనా నేపధ్యంలో గత యేడాది నుంచి తిరమలకు వచ్చే భక్తుల సంఖ్య ఘననీయంగా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో క్రమ క్రంగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఐతే కరోనా కేసులు సంఖ్య తగ్గినా, ఇకపై తిరుమల కొండపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈమేరకు కరోనా వ్యాక్సిన్ నిబంధనను అమల్లోకి తెచ్చింది టీటీడీ.
ఇకపై శ్రీ వారి దర్శనం కోసం తిరుమల కొండపైకి వచ్చే భక్తులు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ ఉన్నట్లు సర్టిఫికెట్ తేవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అందుకని ఇకపై తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులంతా ఖచ్చితంగా రెండు డోసుల కరోనా టీకా తీసుకుని రావాలి. లేదంటే తిరుమలకు వచ్చే మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేసుకుని, నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకుని రావాలి.
మరోవైపు ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున సర్వ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్ లో విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈనెల 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్ లో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు.