టీకా కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్య కార్యకర్తలు ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు టీకాలూ ఇచ్చేశారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బీహార్‌లో పాట్నా శివారులోని పున్‌పున్ పట్టణంలోని ఓ పాఠశాలలో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అవధ్‌పూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ళ సునీలా దేవి కొవిడ్ టీకా తీసుకునేందుకు టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడ 18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వారికి కొవిషీల్డ్, 45 ఏండ్లు పైబడిన వారికి కొవాగ్జిన్ టీకాలు ఇస్తున్నారు. ఈ రెండు రకాల టీకాలను ఒకే గదిలో ఇస్తుండటంతో నిరక్షరాస్యురాలైన నీలాదేవి ముందుగా 18 నుంచి 45 ఏండ్ల వయసువారితో క్యూ లైన్‌లో నిలబడింది. దాంతో వైద్యులు ఆమెకు కొవిషీల్డ్ టీకా ఇచ్చారు. మొదట వెళ్లి కొవిషీల్డ్ టీకా వేయించుకున్న ఆమె సిబ్బంది సూచనతో కాసేపు అక్కడే కూర్చుంది. ఐదు నిమిషాల తర్వాత మరో వరుసలోకి వెళ్లి కొవాగ్జిన్ టీకా వేయించుకున్నట్టు వైద్యాధికారి తెలిపారు.
జరిగిన పొరపాటును గ్రహించిన వైద్యులు ఆమెను 24 గంటలపాటు ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తుందనే హామీ ఇచ్చి పంపించారు. కానీ గంటల సమయం గడిచినా వైద్యులుగానీ, నర్సులుగానీ ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించలేదు. నీలాదేవికి గొంతు తడారిపోతుంటే ఆమె కుటుంబసభ్యులే గ్లూకోజ్ తాపుతూ సపర్యలు చేశారు. నీలాదేవికి వ్యాక్సినేషన్ విషయంలో పొరపాటు తమదేనని అవధ్‌పూర్‌కు చెందిన ఏఎన్ఎం అంగీకరించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.
వ్యాక్సిన్ ప్రక్రియ గురించి వృద్ధురాలికి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నారు. అయితే రెండు వేర్వేరు వ్యాక్సిన్‌లవల్ల నీలాదేవిలో తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఏమీ లేదని వైద్యాధికారి తెలిపారు.