బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్. మొన్నటివరకు ఈ షోని యాంకర్ అనసూయ హోస్ట్ చేయగా.. నిన్నటివరకు యాంకర్ రష్మీ.. ఇప్పుడు యాంకర్ సౌమ్య రావు. కొద్దిరోజుల్లోనే జబర్దస్త్ లో ఈ మార్పులన్నీ జరిగిపోయాయి. అయితే.. కంటెస్టెంట్లు, జడ్జిలు మారుతుండటం చూశాం గానీ, ఇలా ఫామ్ లో ఉన్న యాంకర్స్ మారిపోవడం అనేది అరుదుగా చూస్తుంటాం. రీసెంట్ గా జబర్దస్త్ షోలో అదే జరిగింది. ఫామ్ లో ఉన్న యాంకర్ రష్మీని పక్కకు జరిపి.. కొత్తగా సీరియల్ ఆర్టిస్ట్ సౌమ్య రావును జబర్దస్త్ యాంకర్ గా పరిచయం చేశారు నిర్వాహకులు. అలాగే కొత్త యాంకర్ తో ప్రోమో కూడా రిలీజ్ చేసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ క్రమంలో జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చేసరికి.. ఆమె ఎవరు? ఎక్కడినుండి వచ్చింది? ఇదివరకు ఏం చేసింది? అంటూ వివరాలు ఆరా తీసే ప్రయత్నాలు చేశారు. అయితే.. సౌమ్య రావు గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా శ్రీమంతుడు సీరియల్ చూసేవారికి ఈమె బాగా తెలుసు. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ.. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి.. కొన్నేళ్లుగా సీరియల్స్ లో స్థిరపడిపోయింది. కన్నడతో పాటు తమిళ, తెలుగు సీరియల్స్ లో నటిస్తోంది. అయితే.. ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ గా వచ్చింది.. కాబట్టి, దాదాపు కొంతకాలం తెలుగులోనే సీరియల్స్, షోస్ తో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.
ఇక జబర్దస్త్, ఢీ లాంటి పాపులర్ షోలకు కొత్తగా ఎవరు వచ్చినా.. వారి కెరీర్ విషయాలతో పాటు రెమ్యూనరేషన్ గురించి కూడా తెలుసుకునే ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పుడు సౌమ్య విషయంలో కూడా అదే జరుగుతుందట. జబర్దస్త్ లో యాంకర్ గా ఒక్కో ఎపిసోడ్ కి సౌమ్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది? అనే కథనాలు బాగా వైరల్ అవుతున్నాయి. వాటి సమాచారం ప్రకారం.. జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య రావు.. ఒక్కో ఎపిసోడ్ కి రూ. 85 వేలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సౌమ్య యాంకరింగ్, గ్లామర్ తోడై షోకి మంచి రేటింగ్ వస్తే మాత్రం.. ఆమె పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చిన ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.