ప్రైవేటు ల్యాబ్‌ల ఇష్టారాజ్యం!..

కరోనా పరీక్షల్లో జరుగుతున్న దోపిడీ. పలు ప్రైవేటు వైద్యశాలలు, ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక పక్క మహమ్మారి బారిన పడి అల్లాడుతున్న పేషెంట్లు మరో దిక్కులేక వారు అడిగినంత సమర్పించుకుని రిపోర్టులతో బయట పడుతున్నారు. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు లేకపోవడంతోనే జనం ప్రైవేటుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

blood collection from home service 500x500 1

ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఉన్నదే దోచుకునేందుకు అన్నచందంగా తయారయ్యాయి. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం వెళ్తే జేబులకు చిల్లులు పడుతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తూ హైదరాబాద్‌లోని ప్రైవేట్ టెస్టింగ్‌ ల్యాబ్‌లు రెచ్చిపోతున్నాయి. వైద్యుల సూచనలు లేకుండానే సీటీ స్కాన్‌ చేసేస్తున్నాయి. ఇతర పరీక్షలకూ అదే పరిస్థితి.

1 14673

అధిక ఫీజులు చెల్లించినా పరీక్షా ఫలితం రావాలంటే కనీసం 48 గంటల సమయం పడుతోంది. కొన్ని పేరొందిన ల్యాబ్‌ల్లో సీటీ స్కాన్‌ చేయించుకోవాలంటే ముందస్తుగా బుకింగ్‌ చేసుకోవాలి. ప్రైవేటు ల్యాబ్‌ దందా ఇంత పెద్దఎత్తున జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కిమ్మనడం లేదు. చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు రోగుల బంధువుల్లో గుప్పుమంటున్నాయి.