దేశాన్ని ఇన్ఫ్లుయెంజా ఫ్లూ భయపెడుతోంది. ఈ ఫ్లూ బారిన పడి చాలా మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా కూడా విజృంభిస్తుండటం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది.
కరోనా.. ఈ పేరు వింటే చాలా అందరూ భయపడిపోతారు. ఈ మహమ్మారి సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. మూడేళ్ల కింద వెలుగుజూసిన కరోనా వైరస్.. మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కొవిడ్ దెబ్బకు ఆ దేశం, ఈ దేశం అనే తేడాల్లేకుండా అన్నీ చిగురుటాకులా వణికిపోయాయి. తీవ్ర ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. కొవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు వ్యాక్సిన్ల కారణంగా వైరస్ బారి నుంచి ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కోలుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆ ప్రాణాంతక వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ఆ మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. తెలంగాణలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది.
తెలంగాణలో బుధవారం 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 54 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల కంటే రాజధాని నగరం హైదరాబాద్‌లోనే అత్యధిక కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం 54 కేసుల్లో 40 కేసులు భాగ్యనగరంలోనే నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. కొవిడ్ పాజిటివ్ రేటు 1.09గా ఉన్నట్లు చెప్పింది. కరోనా వ్యాప్తి తగ్గిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో మళ్లీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు హెచ్3ఎన్2 ఫ్లూ కారణంగా చాలా మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలాంటి టైమ్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తూ ప్రజల్ని మరింత భయాందోళనలకు గురిచేస్తోంది.