స్పేస్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నిజంగా అంతరిక్షంలోనే షూటింగ్ జరిగితే! సాధ్యమేనా అనుకుంటున్నారా! సాధ్యం కానుంది. అంతరిక్షంలో షూటింగ్ జరుపుకోనున్న మొదటి సినిమా ‘ఛాలెంజ్’. హాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను క్లిమ్ షిఫెన్కో తెరకెక్కించబోతున్నాడు. రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ రోస్కాస్మోస్ త్వరలోనే అంతరిక్షంలో షూటింగ్ జరపనున్నామని ప్రకటించింది. ఇందులో రష్యన్ నటి యూలియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఈ ఏడాది అక్టోబరులో ఓ రష్యన్ రాకెట్ ద్వారా ఈ సినిమాని లాంచ్ చేయనున్నారట. అప్పటి వరకు యూలియా, క్లిమ్, అలెనా మోర్డోవినా, కెమెరామేన్ అలెక్సీ డుడిన్లకు స్పేస్ ఏజెన్సీ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తుందట. జీరో గ్రావిటీ ఉన్నప్పుడు విమానాన్ని నడపడం, ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో కిందకు దిగడం వంటి అంశాల్లో యూలియా, క్లిమ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నారు. ఈ ఇద్దరితో పాటు అలెనా మోర్డోవినా, కెమెరామేన్ అలెక్సీ డుడిన్ కూడా అంతరిక్షానికి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే టామ్‌క్రూజ్ ప్రధాన పాత్రధారిగా అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఓ సినిమా చేయాలనుకుంది. ఈ సినిమా చిత్రీకరణను అంతరిక్షంలో జరుపుతామని దాదాపు ఏడాది క్రితం నాసా పేర్కొంది. ఇప్పుడు అంతరిక్షంలో సినిమా రూపొందించేందుకు రష్యా, అమెరికా పోటీ పడుతున్నాయని హాలీవుడ్ వర్గాల్లో కథనాలు వస్తున్నాయి. ఏడాది అక్టోబరులో ఓ రష్యన్ రాకెట్ ద్వారా ఈ సినిమాని లాంచ్ చేస్తారట.