తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నటించిన వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రేక్షకుల గుండెల్లో కొందరు మాత్రమే నిలిచిపోతారు. సహజ నటి సుజాత కూడా తెలుగు ప్రజల మన్ననలు పొందారు.
అలనాటి సినిమాల్లో కథానాయికగా నటించిన సీనియర్ నటి సుజాత అందరికి సుపరిచితమే. ఆమె పాత తరం అగ్రకథానాయకుల సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మూవీస్‌లో నటించిన నటి సుజాత కొన్ని హిందీ చిత్రాల్లో కూడా నటించారు. అనేక తెలుగు చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు చిత్రసీమలో సహజ నటిగా, కీలక పాత్రలు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె జీవితం మొత్తం కన్నీటితోనే కాపురం చేశారు. ఆమె జీవితం ఓ అంతులేని కథ. నటి సుజాత జీవితంలో తన భర్త వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. తను నిజ జీవితానికి సంబంధించిన పరిస్థితుల గురించి తెలుసుకుందాం..
సుజాత మలయాళ నటి. ఆమె శ్రీలంకలోని గల్లేలో జన్మించారు. తన తండ్రి ఉద్యోగ రీత్యా ఆమె బాల్యం శ్రీలంకలోనే గడిచింది. హైస్కూల్ చదువు పూర్తి కాగానే ‘ఎమకులమ్ జంక్షన్’ అనే మలయాళ చిత్రంలో తొలిసారిగా నటించారు. తర్వాత కె. బాలచందర్ దృష్టిలో పడ్డారు. ‘అవల్ ఒరు తోడర్ కథై’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. దీనిని కె. బాలచందర్ తెరకెక్కించారు. ఇది సుజాత నటించిన మొదటి తమిళ సినిమా. దీనిని తెలుగులో ‘అంతులేని కథ’గా విడుదల అయింది. తర్వాత బాలచందర్ ఆధ్వర్యంలోనే మరో చిత్రం ‘అవర్గల్’ కూడా సుజాతకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనిని ‘ఇది కథ కాదు’ అని తెలుగులో రూపొందించారు. దాసరి నారాయణరావు గారు ‘గోరింటాకు’ చిత్రంతో సుజాతను తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. తెలుగులో ఆమె నటించిన మొదటి చిత్రం అప్పట్లో సూపర్ హిట్ కొట్టింది.
ఆ తర్వాత వరుసగా దాసరి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర్‌రావు, సీనియర్ ఎన్టీఆర్, కృష్ంరాజు, కృష్ణ హీరోలతో అనేక చిత్రాల్లో నటించారు. పండంటి జీవితం, రగిలే జ్వాల, గుప్పెడు మనసు, ప్రేమ తరంగాలు, బంగారు కానుక, బహుదూరపు బాటసారి, సూత్రధారులు మొదలైన సినిమాల్లో కీలక పాత్రను పోషించారు. ‘చంటి’ సినిమాలో హీరో వెంకటేష్‌కు.. ‘పెళ్ళి’ మూవీలో పృథ్వీకి తల్లిగా సుజాత నటించారు.
ఇలా ప్రముఖ హీరోల సరసన నటించిన ఆమె నిజ జీవితం మొత్తం కన్నీటి గాథలే. సుజాత జయశంకర్ అనే వ్యక్తిని ప్రేమించి.. ఇంట్లో వారు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు. తను పెళ్లి చేసుకున్న సమయంలో అతను పచ్చళ్ల బిజినెస్ చేసేవాడు. ఆ రోజుల్లోనే విదేశాలకు కూడా వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. ఆ తర్వాత బిజినెస్ అంతగా సాగకపోవడంతో సుజాత సంపాదనపై ఆధారపడాల్సి వచ్చింది. అప్పటి నుండి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. జయశంకర్ తన వ్యాపారాన్ని పూర్తిగా ముగించుకుని సుజాతతో సినిమా షూటింగ్‌లకు వెళ్లేవాడు. షూటింగ్ జరిగే సమయంలో సుజాత ఎవరితోనైనా మాట్లాడుతూ కనబడితే చాలా అనుమానపడేవాడు. షూటింగ్ తర్వాత ఇంటికి చేరుకున్నాక మానసికంగా.. శారీరకంగా చాలా హింసించేవాడు. దీంతో ఆమె షూటింగ్ సమయంలో ఎవరితో ఎక్కువగా మాట్లాడేదికాదు. భర్తతో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఎన్ని గొడవలు ఉన్నాకూడా పిల్లల చదువులపై మాత్రం ఆమె ఎక్కువగా శ్రద్ధ తీసుకునేవారు. కొడుకు సాజిత్ సాఫ్ట్‌వేర్ రంగంలో, కూతురు దివ్య డాక్టర్‌గా స్థిరపడ్డారు. సుజాతపై తన భర్త అనుమానం వ్యక్తం చేయడంతో చాలా సినిమా అవకాశాలు వదులుకోవలసి వచ్చింది. తర్వాత ఆమె ఆరోగ్యం చాలా దెబ్బతింది. ఆమెకు మంచి సినిమా అవకాశాలు వచ్చే సమయంలోనే అనారోగ్యానికి గురైయ్యారు. నటి సుజాత రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. చికిత్స పొందుతూ 2011 ఏప్రిల్ 6న చెన్నైలో గుండెపోటుతో సుజాత చివరి శ్వాస విడిచారు. ఆమె ప్రేమించి పెళ్లిచేసుకున్న వ్యక్తితోనే జీవితాంతం కన్నీటి కాపురం చేసి.. చివరకు అనారోగ్యంతో కన్నుమూశారు.