కేంద్ర ప్రభుత్వంపై యుద్దం ప్రకటించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వంపై యుధ్దం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలుకు సంబందించి తెలంగాణ సర్కార్ కు, సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య వివాదం చలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇదిగో ఇటువంటి సమయంలో యాసంగిలో వరిసాగుపై రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంబనకు తెలంగాణ సీఎం కేసీఆర్ చెక్ పెట్టేందుకు సన్నద్దమయ్యారు.

కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయలేమని మోడీ సర్కార్ చెబుతుంటే, ఇక్కడి బీజేపీ నేతలు రైతులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్‌ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

kcr 1

బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికో నీతి, ప్రాంతానికి మరో నీతి పాటిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. పంజాబ్‌ లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలో ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ సర్కార్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.

రైతుల మేలు కోరి యాసంగిలో వరి సాగు వద్దని వ్యవసాయ మంత్రి ప్రకటన చేస్తే, వరి సాగు వేయాల్సిందేనని బండి సంజయ్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు అంశంపై బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడంతో పాటు, గురువారం మహాధర్నా చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు దగ్గర టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.