బాలీవుడ్ ఎంట్రీకి నో చెప్పిన సాయిపల్లవి?!.

అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు వీవీ వినాయక్ ఈ ఛత్రపతి హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇటు బెల్లంకొండకు అటు వీవీ వినాయక్‌కు ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కానుంది. ఛత్రపతి’ సినిమాలో యాక్షన్, ఎమోషన్, అమ్మ సెంటిమెంట్ అన్నీ కలగలసి ఉంటాయి. ఇటువంటి సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆదరిస్తారనే చెప్పాలి. అందుకనే ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ ఎంచుకున్నాడని టాక్ నడుస్తోంది. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి జయంతిలాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మాతృకకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో నటించే కథానాయిక బాలీవుడ్ భామ అనన్య పాండే కోసం ఈ చిత్ర బృందం ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘లైగర్’ చిత్రంలో అనన్య కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ కాలేదని సమాచారం.

Sai Pallavi Twitter

ఈ క్రమంలో ఇటీవల ఫిదా బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించారట. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగులో ప్రభాస్ సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ‘ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఛత్రపతి’ సినిమా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. అలాగే బాలీవుడ్ లో కూడా ఈ సినిమా విజయవంతమై హీరో శ్రీనివాస్ సినీ జీవితాన్ని మలుపు తిప్పాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక హీరోయిన్‌గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.