కరోనా పేషెంట్‌కు ఎంత ఆక్సిజన్ కావాలి!?.

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వీటి కొరత తీవ్రతరం అయింది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ కాన్సంట్రేటర్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వాతావరణంలో ఉండే ప్రాణవాయువును ఉపయోగించి శుద్ధి చేయబడిన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఆక్సిజన్‌ను హెచ్ఎఫ్ఎన్‌సికి ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ప్రజలకు ఇళ్ల దగ్గర కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెంచుకోవడానికి ఈ కాన్సంట్రేటర్లు బాగా ఉపయోగపడతాయి. అయితే ఇది కేవలం నిమిషానికి రెండు, మూడు లీటర్ల ఆక్సిజన్ అవసరం ఉన్నప్పుడే అని డాక్టర్లు చెప్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉన్నా, పేషెంట్లకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా వెంటనే ఆస్పత్రికి తరలించాలని వైద్యుల సలహా. అలాగే ఆక్సిజన్ అవసరం బాగా ఉన్న పేషెంట్లను ఆస్పత్రికి తరలించాలని, ఎందుకంటే కరోనా ఇన్ఫెక్షన్‌ను తట్టుకోవాలంటే కేవలం ఆక్సిజన్ ఉంటే సరిపోదని, ఇంకా చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వాళ్లు పేర్కొన్నారు.

కరోనా పేషెంట్లలో కేవలం పదిశాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుంది. వారిలో చూడా అతికొద్ది మందికి హై ఫ్లో నాజల్ కాన్నులా (హెచ్ఎఫ్ఎన్‌సీ) అవసరం అవుతుంది. ఒక సాధారణ వ్యక్తి విశ్రాంతిగా పడుకొని ఉన్నప్పుడు నిమిషానికి 7 నుంచి 8 లీటర్ల గాలిని పీల్చుకుంటాడు. వాతావరణంలో వాయువుల నిష్పత్తి ప్రకారం, ఇలా మనం పీల్చుకునే గాలిలో 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. మనం వదిలేసే శ్వాసలో 15 శాతం ప్రాణవాయువు ఉంటుంది. మిగిలిన దాన్ని ఊపిరితిత్తులు తీసుకొని శరీరానికి అందజేస్తాయి. ఇది గనుక తగ్గితే కచ్చితంగా ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉన్నట్లే. కరోనా పేషెంట్లు ఒక ఆరు నిమిషాలు ఆగకుండా నడివాలి. ఇలా నడిచే ముందు ఆక్సిజన్ స్థాయులను పరీక్షించుకోవాలి, అలాగే నడక పూర్తయిన తర్వాత కూడా టెస్టు చేయించుకోవాలి. నడిచిన తర్వాత ఆక్సిజన్ స్థాయి పెరగకుండా తగ్గిందంటే పరిస్థితి ప్రమాదకరమని అర్థం. ఆరు నిమిషాల నడక పూర్తి చేయడం కష్టంగా ఉన్నా, శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారినా ఇది కూడా వార్నింగే. దీనర్థం శరీరం ఆక్సిజన్ కోసం కొట్టుకుంటోందని. వీరికి కచ్చితంగా మెడికల్ ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందని వైద్యులు వివరించారు.