ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఎవరిని తొలగిస్తారో కూడా తెలియని పరిస్థితి. సింపుల్ గా ఒక మెయిల్ పెట్టేసి మిమ్మల్ని తొలగిస్తున్నాం అంటూ చెబుతున్నారు. అది ఫ్రెషర్స్ నుంచి 15 ఏళ్ల అనుభవం కలిగిన ఉద్యోగులను సైతం తొలగిస్తున్నారు. చిన్నా చితక కంపెనీలు, స్టార్టప్ లు మాత్రమే కాదు.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సైతం లేఆఫ్స్ కి వెళ్లారు. గూగుల్ అయితే రాబోయే అనర్థాలను ఆపడానికే ఇలా చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది. ఒక్కో కంపెనీ కొన్ని వేల మంది ఉద్యోగులను తొలగించింది. కానీ, యాపిల్ కంపెనీ మాత్రం అలాంటి పని చేయలేదు. దాని వెనుక 3 బలమైన కారణాలు ఉన్నాయి.. అవేంటో చూద్దాం.
లేఆఫ్స్.. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ సంస్థల్లో ఈ పదం బాగా వైరల్ అవుతోంది. ఎప్పుడు ఎవరిని ఇంటికి పంపిస్తారో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్నారు. ఆర్థికమాద్యం, భవిష్యత్ పై భయాలు నెలకొనడంతోనే టెక్ కంపెనీలు లేఆఫ్స్ కి వెళ్తున్నాయి. ఇందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలు కూడా అతీతులేమీ కాదు. కానీ, ఒక్క యాపిల్ కంపెనీ మాత్రం ఒక్క ఉద్యోగిని కూడా తీసేయలేదు. ఏ ఒక్క ఎంప్లాయిని లే ఆఫ్స్ పేరిట తొలగించలేదు. అయితే యాపిల్ కంపెనీ అలా చేయగలగడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వడం వల్లే వారు ఉద్యోగాలను కాపాడగలిగారు.
యాపిల్ సీఈవో టిమ్ కుక్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంది. అదేంటంటే.. ఉద్యోగులను తొలగించే బదులుగా టిమ్ కుక్ తన జీతాన్ని తగ్గించుకున్నారు. అవును సీఈవోగా తనకు అందే జీతంలో 50 శాతంలో కోత విధించుకున్నారు. దీని వల్ల మిగిలిన ఉద్యోగులకు జీతాలను చెల్లించేందుకు వీలవుతుందని భావించారు. 2022లో టిమ్ కుక్ 99.4 మిలియన్ డాలర్ల(రూ.821 కోట్లకుపైనే) ప్యాకేజీ అందుకున్నాడు. దానిలో 50 శాతం కోత విధించుకుని.. 49 మిలియన్ డాలర్లు(రూ.405 కోట్లకుపైనే) మాత్రమే జీతంగా తీసుకుంటానని ప్రకటించారు. టిమ్ తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీకి ఎంతో ఖర్చను తగ్గించింది. దాని వల్ల ఉద్యోగులను తొలగించే అవసరం రాలేదనే చెప్పాలి.
కరోనా సమయంలో టెక్ దిగ్గజ కంపెనీలు అన్నీ దాదాపుగా 30 నుంచి 50 శాతం వరకు ఉద్యోగులను హైర్ చేసుకుంది. వాటిలో పోలిస్తే యాపిల్ కంపెనీ చాలా తక్కువ మందికే ఉద్యోగాలు ఇచ్చింది. గూగుల్ సీఈవో లేఆఫ్స్ సమయంలో చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. ‘కరోనా సమయంలో అవసరాన్ని బట్టి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు వారిని తొలగించక తప్పడం లేదు’ అని వ్యాఖ్యానించారు. యాపిల్ మాత్రం ఎక్కువ మందిని తీసుకోలేదు.. ఉద్యోగాలు తొలగించలేదు. ఈ విషయంలో యాపిల్ కంపెనీ ముందు చూపుని అంతా మెచ్చుకుంటున్నారు.
చాలా టెక్ కంపెనీలలో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉచిత కాఫిటేరియా సదుపాయం, ఉచితంగా భోజనాలు పెట్టడం చేస్తుంటాయి. ముఖ్యంగా గూగుల్, మెటా సంస్థలు వారి ఉద్యోగులకు ఎన్నో ఉచిత సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అయితే అలా చేయడం వల్ల కంపెనీపై ఆర్థికభారం తప్పకుండా బడుతుంది. అది కూడా ఇప్పుడు లేఆఫ్స్ కారణంగా నిపుణులు చెబుతున్నారు. కానీ, యాపిల్ అలా ఉచిత భోజనాలు వంటివి ప్రొవైడ్ చేయదు. యాపిల్ కంపెనీకి అలాంటి అదనపు భారాలు లేకపోవడం కూడా ఇప్పుడు లేఆఫ్స్ కి వెళ్లకుండా ఉండేందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సమయంలో యాపిల్ సంస్థ ఉద్యోగాలు కాపాడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.