అమ్మాయిలు వీడియో కాల్స్ చేసి ఉన్నట్టుండి బట్టలు విప్పేసి ఆ వీడియోని రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. కొంతమంది అమ్మాయిలు బట్టలు విప్పించి రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ విధంగా డబ్బులు గుంజే స్కామ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది మాత్రం నెక్స్ట్ లెవల్ స్కామ్. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతారు.
ఇప్పటి వరకూ మీరు ఎన్నో రకాల మోసాలు చూసుంటారు. డేటా ఎంట్రీ అని, ఓటీపీ స్కామ్ అని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని, చిట్ ఫండ్ మోసాలు, బ్యాంక్ లోన్ మోసాలు, రెంటల్ స్కామ్స్, న్యూడ్ వీడియో కాల్ స్కామ్స్ ఇలా అనేక రకాల స్కామ్స్ గురించి మీరు తెలుసుకునే ఉంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న స్కామ్ గురించి చాలా మందికి తెలియదు. నిజంగా అది స్కామ్ అని అస్సలు గుర్తుపట్టలేరు. తెలిసేలోపు వేలు, లక్షల రూపాయలు పోగొట్టుకుంటారు. ఇంతకీ ఏంటా స్కామ్? ప్రస్తుతం మోసగాళ్ల నయా ట్రెండ్ ఇదే. ఇప్పటి వరకూ సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేసి.. ఫ్రెండ్స్ ని డబ్బులు అడిగేవారు. ఈ ఫ్రాడ్ గురించి జనాలకు బాగా తెలియడంతో మోసగాళ్లు కూడా కొత్త దారి ఎంచుకున్నారు.
ఫేమస్ అయిన వారి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి.. వారిలా నటిస్తూ చాటింగ్ లోనో, పోస్ట్ లోనో డబ్బులు అడిగేవారు. అధికారిక ఖాతా అనుకుని చాలా మంది మోసగాడు ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకుంటారు. ఇది అందరికీ తెలిసిపోయిన మోసమే. సోషల్ మీడియా ద్వారా చాట్ చేసి డబ్బులడుగుతుంటే జనాలు నమ్మడం లేదని.. ఏకంగా ఆ సెలబ్రిటీలా కనబడుతూ వీడియో కాల్ చేసి మరీ మోసం చేస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీల్లా వీడియో కాల్స్ చేసి మరీ ఫ్యాన్స్ ని మోసం చేస్తున్నారు. అదెలా సాధ్యం అనే కదా మీ అనుమానం. దాని కోసం ఈ మోసగాళ్ళేమీ మాయలు, మంత్రాలు, గారడీ విద్యలు చేయడం లేదు. జస్ట్ డీప్ ఫేక్ టెక్నాలజీని వాడుతున్నారు అంతే. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి ఐడియా ఉండే ఉంటుంది.
సినిమాల్లో క్లిప్ లకి హీరో, హీరోయిన్ ముఖానికి మన ముఖం తగిలించుకునే టెక్నాలజీ. పలానా సినిమాలో హీరో ప్లేస్ లో మన ముఖం తగిలించుకుని మురిసిపోతూ ఆ కాసేపు హీరో అనిపించుకోవడం కోసం ఈ యాప్ ని కొంతమంది కోసం తీసుకొచ్చారు. అయితే ఈ యాప్ ని కొంతమంది మిస్ యూజ్ చేస్తున్నారు. సినిమా హీరోయిన్ల ముఖాలను అశ్లీల వీడియోలకు తగిలించి అశ్లీల వెబ్ సైట్స్ లో పెడుతున్నారు. కొంతమంది అయితే ప్రముఖ రాజకీయ నాయకుల ముఖాలను వేరే వ్యక్తుల శరీరాలకు తగిలించి.. వారే మాట్లాడుతున్నట్టుగా తప్పుడు స్పీచ్ లని సృష్టిస్తున్నారు. దీంతో జనం అది నిజమే అని భ్రమలో బతుకుతున్నారు. అయితే దీన్ని ఎందుకు మనం వాడకూడదు అని చెప్పి మోసగాళ్లు ఇందులోకి కూడా వచ్చేసారు.
డీప్ ఫేక్ టెక్నాలజీతో ఒక ఫేమస్ సెలబ్రిటీ ముఖాన్ని మోసగాడు తన శరీరానికి అతికించుకుని.. వీడియో కాల్ చేసి సమస్య ఉందని డబ్బులు అడుగుతాడు. అది నిజమని నమ్మి ఫ్యాన్స్ అతని ఖాతాలో డబ్బులు వేస్తారు. ఆ తర్వాత ఆలస్యంగా తెలుస్తుంది.. అడిగింది మనోడు కాదు.. మోసగాడు అని. వాయిస్ తెలిసిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ డీప్ ఫేక్ టెక్నాలజీతో మనిషినే కాదు.. వాయిస్ ని కూడా మార్ఫింగ్ చేస్తున్నారు. ఈ డీప్ ఫేక్ ఫ్రాడ్ వల్ల ఇటీవల కాలంలో చాలా మంది మోసపోయారు. రీసెంట్ గా కేరళకు చెందిన వ్యక్తి రూ. 45 వేలు మోసపోయాడు. రాధాకృష్ణన్ అనే వ్యక్తికి కొత్త నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. అచ్చం తన ఫ్రెండ్ లానే కనబడడంతో నమ్మాడు. నమ్మి రూ. 40 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఫ్రెండ్ లా మళ్ళీ వీడియో కాల్ చేసి రూ. 30 వేలు అడిగేసరికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్నాడు.