పెద్ద పెద్ద వీడియోలు పంపుకోవాలంటే టెలిగ్రామ్ యాప్ లో పంపించుకుంటారు. అయితే వాట్సాప్ లో మాత్రం పెద్ద వీడియోలను పంపడానికి అవకాశం లేదు. తక్కువ సైజ్ ఉన్న ఫోటోలు, వీడియోలు పంపితేనే కంప్రెస్ అయిపోయి క్వాలిటీ తగ్గిపోతుంది. అయితే వాట్సాప్ లో హెచ్డీ వీడియోలు పంపుకునేలా సరికొత్త ఫీచర్ రాబోతుంది.
వాట్సాప్ లో ఫోటోలు, వీడియోలు కూడా పంపించుకుంటూ ఉంటారు. అయితే అవతలి వ్యక్తికి పంపించిన తర్వాత ఫోటోలు, వీడియోల క్వాలిటీ తగ్గిపోతుంది. వాట్సాప్ సర్వర్ లో అవి కంప్రెస్ అయ్యి వస్తాయి. దీని వల్ల వీడియో, ఫోటో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ ఫోటోలు, వీడియోలు క్వాలిటీ తగ్గకుండా పంపించుకోవాలంటే డాక్యుమెంట్ లో పంపించుకోవాల్సి వచ్చేది. డాక్యుమెంట్ రూపంలో కాకుండా నేరుగా ఫోటోలు, వీడియోలు పంపుకునే సదుపాయం కల్పించమని వినియోగదారులు గతంలో అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. అయితే వాట్సాప్ నుంచి ఎటువంటి స్పందన లేదు. తాజాగా దీనిపై వాట్సాప్ దృష్టి పెట్టింది. క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా ఫోటోలు, వీడియోలు పంపించుకోవచ్చు.
హై క్వాలిటీ వీడియోలను వాట్సాప్ లో పంపించుకోవడానికి వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే జూన్ మొదటి వారంలో ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు హెచ్డీ క్వాలిటీతో ఫోటోలు పంపే ఫీచర్ ని పరిచయం చేసింది. ఇప్పుడు వాట్సాప్ బీటా అప్డేట్ 2.23.14.10లో హెచ్డీ వీడియోలను పంపే ఫీచర్ ని పరిచయం చేస్తుంది. వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. వాట్సాప్ డ్రాయింగ్ ఎడిటర్ లో హెచ్డీ వీడియోలు వాట్సాప్ ద్వారా నేరుగా పంపించుకునే బటన్ ను జోడించింది. ఈ ఫీచర్ కనుక లాంఛ్ అయితే నేరుగా వాట్సాప్ ద్వారా వీడియో క్వాలిటీ అనేది తగ్గకుండా పంపించుకోవచ్చు. వీడియో ఒరిజినల్ డైమన్షన్ ను 99 శాతం అలానే ఉంచుతూ ఫార్వార్డ్ చేయవచ్చు లేదా సెండ్ చేసుకోవచ్చు.
అలానే ఫోటోలను కూడా క్వాలిటీ తగ్గకుండా ఒరిజినల్ డైమన్షన్స్ తో పంపించుకోవచ్చు. ఈ ఆప్షన్ తో ఫోటో లేదా వీడియో గానీ సెండ్ చేసినప్పుడు హెచ్డీ అనే ఓ ట్యాగ్ కనిపిస్తుంది. దీని ద్వారా ఆ ఫోటో లేదా వీడియో హై క్వాలిటీగా గుర్తించవచ్చు. వాట్సాప్ బీటా ఇన్ఫో ఒక స్క్రీన్ షాట్ ని షేర్ చేసింది. ఇందులో ‘హెచ్డీ ఫోటోలు చాలా స్పష్టంగా ఉంటాయి, స్టాండర్డ్ ఫోటోలు తక్కువ స్టోరేజ్ స్పేస్ ని వాడుకుని వేగంగా అవతల వారికి సెండ్ అవుతాయి’ అని ఉంది. అలానే స్టాండర్డ్ క్వాలిటీ, హెచ్డీ క్వాలిటీ అనే రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్టాండర్డ్ క్వాలిటీలో ఫోటో డైమన్షన్ వచ్చేసి 392×848 ఉంటే.. హెచ్డీ క్వాలిటీ డైమన్షన్ 592×1280 గా ఉంది. స్టాండర్డ్ క్వాలిటీలో ఫోటో స్టోరేజ్ స్పేస్ 2.2 ఎంబీ ఉంటే.. హెచ్డీ క్వాలిటీలో 4.9 ఎంబీగా ఉంది.
ఇక వీడియో సైజ్ ఎంత సైజ్ వరకూ పంపించవచ్చు అనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే పూర్తిగా ఒరిజినల్ క్వాలిటీలో షేర్ చేయలేకపోయినా ఈ కొత్త ఫీచర్ తో ప్రస్తుతం ఉన్న క్వాలిటీతో పోలిస్తే మెరుగైన క్వాలిటీతో పంపించుకునే వీలుంటుందని అంటున్నారు. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత డిఫాల్ట్ గా స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుందని.. హెచ్డీ క్వాలిటీతో పంపించుకోవాలనుకుంటే హెచ్డీ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలని అంటున్నారు. ప్రతి సారీ ఇలానే చేసుకోవాలట. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటాను ఇన్ స్టాల్ చేసిన బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇది యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ తో పాటు ఐఫోన్ లో కూడా ఈ ఫీచర్ వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.