టెక్నాలజీ అభివృద్ది చెందడంతో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఎడిట్ ఆప్షన్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా షార్ట్ వీడియో మెసేజ్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకున్నారు.
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఉన్న క్రేజే వేరు. ఏ సమాచారమైన క్షణాల్లో వాట్సాప్ ద్వారా పంపించి వారి పనులను సులభతరం చేయడంలో వాట్సాప్ కీలకపాత్ర పోషిస్తోంది. వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరు సమాచారాన్ని చేరవేసుకుంటారు. వాట్సాప్ యాప్ లేని స్మార్ట్ ఫోన్ బహుశా ఉండదేమో. దాదాపు ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ వాట్సాప్ వినియోగిస్తుంటారు. అయితే యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ సమాచారం చేరవేయుటను మరింత సులభతరం చేస్తోంది. ఈ క్రమంలో మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. ఆ వివరాలు మీకోసం.
వాట్సాప్ ద్వారా మరింత సులువుగా, ఖచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని చేరవేయడానికి షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్ ను వాట్సాప్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు టెక్ట్స్ మెసేజ్, వాయిస్ రికార్డ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే సమాచారాన్ని మరింత స్పష్టంగా తెలియజేయాలంటే వీడియో రూపంలో మనం చెప్పాలనుకున్న విషయాన్ని పంపించాల్సి ఉంటుంది. కానీ దీనికోసం ముందుగానే వీడియో రికార్డ్ చేసి ఆ తర్వాత వాట్సాప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. కానీ కొత్త ఫీచర్ ద్వారా రియల్ టైమ్ వీడియో రికార్డ్ ను పంపవచ్చు.
ఒక నిమిషం వీడియోను రికార్డ్ చేసి వాట్సాప్ ద్వారా పంపవచ్చు. ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలంటే.. వాట్సాప్ లోని టెక్ట్స్ బాక్స్ లో ఉన్న వాయిస్ రికార్డ్ ఆప్షన్ ను కొన్ని సెకన్లపాటు హోల్డ్ చేస్తే అది వీడియో రికార్డ్ ఆప్షన్ కు మారుతుంది. దీనిని ఉపయోగించి 60 సెకన్ల పాటు వీడియోను రికార్డ్ చేసి మీకు కావాల్సిన వారికి పంపుకోవచ్చు. ఈ ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు వాట్సాప్ తెలిపింది. కాగా ఈ ఫీచర్ ను వాడుకోవాలంటే వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.