ఇంటర్నెట్ లేకుండా మొబైల్ లోనే ప్రత్యక్ష ప్రసార టీవీ ఛానల్లను చూసే టెక్నాలజీ వైపు కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
టెక్నాలజీలో వస్తోన్న విప్లవాత్మక మార్పుల వల్ల నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం అయ్యింది. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అంతా అరచేతిలో వాలిపోయింది. ఏ విధమైన సమాచారం కావాలన్నా ఇటర్నెట్ సాయంతో క్షణాల్లో పొందే వీలుఏర్పడింది. కాగా ఇప్పుడు మరో కొత్త ఆవిష్కరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై డాటా లేకుండానే మొబైల్ ఫోన్ లలో లైవ్ టీవీ ఛానల్స్ ను చూసే అవకాశాన్ని కల్పించబోతోంది. ఈ సౌకర్యంతో ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ లైవ్ టీవీ ప్రసారాలను చూసి ఆనందించవచ్చు. ఈ విధానాన్ని అభివృద్ధి చేసి త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
సాధారణంగా మనం టీవీ ఛానల్స్ చూడాలంటే డీటీహెచ్ కనెక్షన్, కేబుల్ కనెక్షన్ లను ఏర్పాటు చేసుకుని ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించే వీలుంది. అయితే మొబైల్ ఫోన్ లలో ఇంటర్నెట్ సౌలభ్యం లేకున్నా కూడా లైవ్ టీవీలను చూసే కొత్త సాంకేతి విధానాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఇది డీటీహెచ్ సర్వీస్ లాగా పనిచేస్తుంది. ఆ కొత్త టెక్నాలజీనే డైరెక్ట్-టు-మొబైల్. ఈ టెక్నాలజీతో మొబైల్ డేటా కనెక్షన్ అవసరం లేకుండా వినియోగదారులు తమ మొబైల్‌లలో లైవ్ టీవీ ప్రసారాలను చూసే వీలుకలుగుతోంది.
డైరెక్ట్-టు-మొబైల్ టెక్నాలజీని టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), సమాచార, ప్రసార శాఖ (MIB), IIT-కాన్పూర్ సంయుక్తంగా ఈ టెక్నాలజీని అభివృద్ది చేస్తోంది. కాగా ఈ కొత్త టెక్నాలజీతో టెలికాం ఆపరేటర్లకు వచ్చే సమస్యల పట్ల అధికారులు కూలంకశంగా చర్చలు జరుపుతున్నారు. డైరెక్ట్-టు-మొబైల్ సేవలు అందుబాటులోకి వస్తే డేటా లేకుండా మొబైల్ ఫోన్ లోనే లైవ్ టీవీ ప్రసారాలను వీక్షించొచ్చు.