స్మార్ట్ ఫోన్ ద్వారా భూకంపం వచ్చే సూచనలను ముందుగానే గుర్తించి అలర్ట్ చేస్తుందా? అంటే గూగుల్ అవుననే సమాధానం చెబుతోంది. స్మార్ట్ ఫోన్ లో డేటాని గూగుల్ యాక్సెస్ చేసే అనుమతి ఇస్తే ఆ డేటాను తీసుకుని మీరు ఉండే పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉందో లేదో గుర్తించి వెంటనే మీ ఫోన్ కి హెచ్చరిక సందేశాలు పంపుతుంది.
భూకంపం వచ్చే కొన్ని క్షణాల ముందు జంతువులకు తెలుస్తుందని అంటారు. ఐతే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా భూ ప్రకంపనలు వచ్చే కొన్ని క్షణాల ముందు పసిగట్టి హెచ్చరికలు చేసే సాంకేతికతను కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు, యూఎస్జీఎస్ తో కలిసి గూగుల్ అభివృద్ధి చేస్తోంది. రెండు రకాల టెక్నాలజీలను గూగుల్ డెవలప్ చేస్తోంది. వీటిలో మొదటిది ప్రకంపనలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన 700 సైస్మోమీటర్ల నెట్ వర్క్. రెండవది గూగుల్ సొంత నెట్ వర్క్. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పని చేసే దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లలోనూ యాక్సెలెరో మీటర్ సెన్సార్లు ఉంటాయి. ఇవి ఫోన్ కొంచెం కదిలినా వెంటనే అలర్ట్ చేస్తాయి.
సాధారణంగా ఫోన్ డిస్ప్లే రొటేషన్ కి, ఫిట్నెస్ ట్రాకింగ్ లో ఉపయోగపడతాయి. ఈ సెన్సార్లు చాలా సున్నితంగా ఉండి.. చిన్న సైస్మో మీటర్లలా పని చేస్తాయి. ఆండ్రాయిడ్ ఎర్త్ క్వేక్ అలర్ట్ సిస్టమ్ కు మన ఫోన్ల నుంచి ఆటోమేటిక్ గా డేటాను చేరవేసే సెటప్ ను గూగుల్ తీసుకొచ్చింది. దీనికి అనుమతి ఇస్తే.. భూకంపం వచ్చే ప్రథమ ప్రకంపనలను గుర్తించి వెంటనే అలర్ట్ చేస్తాయి. ఇలా కొన్ని వేల, లక్షల ఫోన్ల నుంచి వచ్చే డేటాను విశ్లేషించి భూకంపం వస్తుందో లేదో ఆండ్రాయిడ్ ఎర్త్ క్వేక్ అలర్ట్ సిస్టమ్ అంచనా వేయగలదు. ఎందుకంటే భూకంప తరంగాల కంటే రేడియో తరంగాలు వేగంగా ప్రయాణం చేస్తాయి. అందువల్ల భూకంప కేంద్రంలో మొదలైన ప్రకంపనలు మనిషిని చేరుకునే లోపు స్మార్ట్ ఫోన్ మనకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది.
దీంతో ఆ ప్రాంతంలో ఉండేవారికి వెంటనే భూకంప హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంటుంది. భూకంప తరంగాలపై కాంతి వేగంతో పోటీ పడుతున్నట్లు ఆండ్రాయిడ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న మార్క్ స్టోగైటిస్ అన్నారు. అయితే మారుమూల ప్రాంతాల్లో ఫోన్లు ఉపయోగించే వారు తక్కువగా ఉంటారు. కాబట్టి అక్కడ భూకంప ప్రకంపనలను అంచనా వేయడం కుదరదు. అలానే తీరా ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే కొన్ని క్షణాల్లోనే సునామీలు వస్తాయి. దీంతో స్మార్ట్ ఫోన్ లో ఉన్న టెక్నాలజీ స్పందించేందుకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. భూకంపం వచ్చే కొన్ని సెకన్ల ముందు హెచ్చరికలు జారీ చేయవచ్చునేమో గానీ భూకంపం రాకముందు కనిపెట్టడం అనేది ప్రస్తుతానికి అసాధ్యం. దీనిపై గూగుల్ పని చేస్తుంది.
అయితే కొన్ని సెకన్ల ముందు అయినా విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ కాకుండా, రైళ్ల వేగం తగ్గించుకోవచ్చు, కార్లు కూడా సొరంగాల్లోకి వెళ్లకుండా ముందుగానే అప్రమత్తం కావచ్చు. కొన్ని క్షణాలే అయినా వెంటనే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2022 అక్టోబర్ లో శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో జీవించే వారి ఫోన్ల నుంచి గూగుల్ కి భూకంప హెచ్చరిక సందేశాలు వచ్చాయి. భూకంప కేంద్రం నుంచి ప్రకంపనలు వచ్చే సమయంలోనే ఈ సందేశాలు వచ్చాయి. భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న 90కి పైగా దేశాల్లో ఈ భూకంప హెచ్చరికల వ్యవస్థ అందుబాటులో ఉంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైనే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి డేటా వస్తుంది.