టెక్నాలజీ రోజురోజుకీ మరింత మెరుగవుతోంది. ఇప్పుడు ప్రజల జీవితాల్లో జీవితాల్లో సాంకేతికత ఓ భాగమైపోయింది. ఇంటర్నెట్ విప్లవంతో కంప్యూటర్లు, ఫోన్ల వాడకం ఎక్కువైంది. స్మార్ట్ వాచ్ లాంటి గాడ్జెట్ల వాడకం కూడా ఈమధ్య కాలంలో బాగా పెరిగింది. కాల్స్ మాట్లాడుకునే సదుపాయంతో పాటు హెల్త్ అప్డేట్లు ఇచ్చి యూజర్లను అలర్ట్ చేస్తుంటాయి స్మార్ట్ వాచ్‌లు. మంచి యూజర్ ఎక్స్పీరియన్స్, క్రష్ డిటెక్షన్ వంటి ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్‌లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇలాంటి ఓ స్మార్ట్ వాచ్ ఒక గర్భిణి ప్రాణాలు కాపాడింది. ప్రెగ్నెంట్ మహిళతో పాటు ఆమె కడుపులోని బిడ్డను కూడా ప్రాణాపాయం నుంచి రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. అమెరికాకు చెందిన జెస్సీ కెల్లీ అనే ఓ మహిళ గర్భం ధరించారు.
ప్రెగ్నెన్సీ సమయంలో తన హెల్త్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునేందుకు వీలుగా ఓ యాపిల్ స్మార్ట్ వాచ్‌ను వాడుతున్నారు. ఈ క్రమంలో తన డెలివరీ డేట్‌కు కొన్ని వారాలే ఉందనగా ఆమెకు స్మార్ట్ వాచ్ పదేపదే అలర్ట్ నోటిఫికేషన్స్ పంపడం మొదలుపెట్టింది. హార్ట్ బీట్ అతి వేగంతో కొట్టుకుంటోందని ఈ వాచ్ ఆమెకు తెలియజేయడం ప్రారంభించింది. జెస్సీ కెల్లి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నా ఆమె హార్ట్ బీట్ నిమిషానికి 120గా ఉందని వాచ్ గుర్తించి నోటిఫికేషన్స్ ఇచ్చింది. ప్రతి పది నిమిషాలు, అర్ధ గంటకు వరుస అలర్ట్‌లు వస్తుంటే.. జెస్సీకి తన ఆరోగ్యం మీద తీవ్ర ఆందోళన, అనుమానం కలిగాయి. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లి చెక్ అప్ చేయించుకున్నారు. కెల్లీని ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. డ్యూ డేట్‌కు కొద్ది వారాల సమయం ఉండగానే ఆమె బిడ్డను ప్రసవించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్నారు.
ప్లాసెంటా అబ్రప్షన్ అనే సమస్య వల్ల కెల్లీ బ్లడ్ ప్రెజర్ బాగా పడిపోతోందని తెలియడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు. మూడు గంటల తర్వాత ఆమె బేబీ గర్ల్‌కు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. స్మార్ట్ వాచ్ కారణంగానే తనకున్న అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్నానని కెల్లీ జెస్సీ అన్నారు. శరీరం ఇచ్చే సంకేతాలు, యాపిల్ అలర్ట్స్‌ను ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని ఆమె సలహా ఇచ్చారు. కాగా, ఇలాంటి మరో ఘటనలో యాపిల్ స్మార్ట్ వాచ్ హార్ట్ బ్లాకేజీ గుర్తించి ఓ మహిళ జీవితాన్ని రక్షించింది. అలాగే క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌తో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కాపాడింది. మరి, స్మార్ట్ వాచ్‌ల వల్ల పలువురు ప్రాణాపాయం నుంచి బయటపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.