వర్షాలు కురుస్తున్నప్పుడు ఉరుములు, మెరుపులు సహజం. అదే సమయంలో పిడుగులు కూడా పడతాయి. అయితే ఈ పిడుగులను 20 నిమిషాల ముందే గుర్తించే యాప్ ఒకటి ఉంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల సమయంలో పిడుగులు పడుతుంటాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏటా చాలా మంది పిడుగులా బారినపడి చనిపోతున్నారు. ఎక్కువగా ఎత్తైన భవనాలు, చెట్లపై పిడుగులు పడుతుంటాయి. ఒక్కోసారి రైతులు పొలాల్లో ఉన్నప్పుడు పడుతుంటాయి. అయితే పిడుగులు ఎప్పుడు పడతాయో అనేది క్లారిటీ ఉండదు. దీని వల్ల అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ పిడుగుల నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకొచ్చింది. ఆ యాప్ పేరు దామిని లైట్నింగ్ అలర్ట్. ఇది 15 నిమిషాల ముందు మనం ఉన్న ప్రదేశంలో పిడుగు పడుతుందో లేదో చెబుతుంది.
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ శాఖ కింద పని చేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) ఈ యాప్ ని రూపొందించింది. నిజానికి ఈ యాప్ ను 2020లోనే తయారు చేశారు. 2023 జనవరి 18న కొన్ని ఫీచర్స్ ను చేర్చి అప్ డేట్ చేశారు. కేవలం ఈ యాప్ ని 10 లక్షల మంది మాత్రమే తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్నారు. సరైన ప్రచారం లేక దీని గురించి ఎక్కువ మందికి తెలియలేదు. దేశవ్యాప్తంగా 83 ప్రాంతాల్లో పిడుగులు గుర్తించేందుకు నెట్ వర్క్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జీపీఎస్ లొకేషన్ ద్వారా పిడుగులను గుర్తిస్తుంది. 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగులు పడే సూచనలు ఉంటే ఈ యాప్ ముందుగానే హెచ్చరిస్తుంది. అంతేకాదు పిడుగులు పడే ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ యాప్ సూచిస్తుంది.