నగరంలో ఓ కస్టమర్ డెలివరీ పర్సన్ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆగ్రహంతో ఊగిపోయి డెలివరీ బాయ్ పై దాడికి పాల్పడ్డాడు. దాడికి గురైన డెలివరీ పర్సన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ప్రముఖ ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థలు కస్టమర్లకు తమకు కావాల్సిన వస్తువులను డెలివరీ పర్సన్స్ ద్వారా చేరవేస్తుంటాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థల్లో వందల మంది డెలివరీ పర్సన్స్ గా చేరి ఉపాధి పొందుతున్నారు. కస్టమర్లు వారు బుక్ చేసుకున్న ఆర్డర్లను సకాలంలో అందించేందుకు ఆకలిదప్పిలను కూడా వదులుకుంటారు. ఆర్డర్ ఆలస్యమైతే కస్టమర్ల అసహనానికి గురైన సందర్బాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాదో ఓ డెలివరీ బాయ్ కి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఆర్డర్ ఆలస్యంగా తెచ్చినందుకు కస్టమర్ డెలివరీ బాయ్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఆకస్మిక పరిణామానికి ఆశ్యర్యపోయి భయాందోళనకు గురయ్యాడు. ఆ వివరాలు మీకోసం..
మహారాష్ట్రకు చెందిన షేక్ రహమాన్ అనే యువకుడు ఆరు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చి బోరబండలో ఉంటున్నాడు. కాగా అతడు అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. అయితే రోజు మాదిరిగానే ఈ రోజు కూడా ఆర్డర్లను డెలివరీ చేసేందుకు కస్టమర్ల వద్దకు బయలుదేరాడు. కాగా కుత్బుల్లాపూర్ కు చెందిన విశాల్ గౌడ్ అనే కస్టమర్ అమెజాన్ లో ఓ ఆర్డర్ పెట్టుకున్నాడు. అయితే ఇతడికి ఆర్డర్ ఇచ్చేందుకు కుత్బుల్లాపూర్ వెళ్లే క్రమంలో డెలివరీ బాయ్ కి దారి సరిగా తెలియక కాస్త ఆలస్యమైంది.
చివరికి డెలివరీ లొకేషన్ కు చేరుకున్న డెలివరీ బాయ్ షేక్ రహమాన్ ఆ ఆర్డర్ ను కస్టమర్ విశాల్ కు అందించాడు. కాగా ఆర్డర్ ఆలస్యం చేసినందుకు కస్టమర్ డెలివరీ బాయ్ పై ఆగ్రహం వ్యక్తం చేసి దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా విశాల్ గౌడ్ తన ఫ్రెండ్స్ తో కలిసి రూంలో బందించి కాలు విరిగేలా కొట్టారు. ఇక వారి నుంచి తప్పించుకున్న డెలివరీ బాయ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని తనపై దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.