ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలపై సంకేతాలు ఉన్నాయా.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారా.. ఈమేరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కొన్ని రోజులుగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే ఆయన ముందస్తు ఎన్నికలకు సిద్ధం కాబోతున్నారనే విషయాన్ని సూచిస్తున్నాయి అంటున్నారు. నెల రోజుల క్రితం వరకు విపక్షాలు ముందస్తు ఎన్నికలు అంటే.. వారి మీద ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు. కానీ నెల రోజుల వ్యవధిలోనే సీన్ మారింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ముందుస్తు దిశగా.. సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఏవి అంటే..
కీలక అధికారుల తొలగింపు..
వారం రోజుల క్రితం జగన్ తన కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ ని బాధ్యతల నుంచి తప్పించారు. అయితే విపక్షాలు ఆరోపించినట్లు.. వారిని వదిలేయక.. కీలక పదవులు కట్టబెట్టారు. అలానే కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని కొత్త డీజీపీగా ప్రకటించారు. ఇక ఎన్నికలు ముగిసే వరకు ఆయనే పోలీస్ బాస్ గా ఉంటారని తెలుస్తోంది. అలానే ఉగాది నాటికి కొత్త జిల్లాల కసరత్తు పూర్తి చేసి కలెక్టర్లు, ఎస్పీల పోస్టింగులు సెట్ చేస్తారు. ఇక ఆ తర్వాత నుంచి జగన్ పూర్తిగా జనాల్లో ఉంటారనే వాదన ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ విషయంలో మారిన జగన్ లెక్క!
దానికి తగ్గట్టుగానే ఈ ఏడాది వైసీపీ భారీ ఎత్తున ప్లీనరీ నిర్వహించాలని భావిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి జూన్ 8వ తేదీతో మూడేళ్లు పూర్తి కానుంది. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున ప్లీనరీ నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ ప్లీనరీ నుంచే జగన్ పార్టీ వ్యవహారాలను పూర్తిగా పట్టించుకోనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. నేతల మధ్య ఐక్యత లేదని జగన్ కి రిపోర్టు చేరిందట. ఇక మీదట జగన్ వీటన్నింటి మీద దృష్టి పెడతారని సమాచారం. ఈ మూడేళ్ల నుంచి జగన్ పార్టీ వ్యవహారాలను పట్టించుకోలేదు. కేవలం పాలన, సంక్షేమ పథకాల అమలుపైనే జగన్ దృష్టి పెట్టారు.
రంగంలోకి పీకే టీం..
ఇప్పటికే పీకే టీం రంగంలోకి దిగిందని సీఎం జగన్ స్వయంగా మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. ప్లీనరీ తర్వాత నుంచి ప్రశాంత్ కిషోర్ టీం నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించి.. రిపోర్టులను సీఎంకి అందించనున్నారట. దాని ప్రకారం కేబినెట్ రూపకల్పన.. కొత్తగా ఏర్పడే నాలుగు జోన్ లకు సీనియర్ మంత్రులకు బాధ్యతలు అప్పగించడం చేయనున్నారని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో చోటు చేసుకొనే పరిణామాల ఆధారంగా జగన్ మరిన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకొనే అవకాశమూ కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి : జగన్ అన్న దగ్గరికి మా నాన్నని రానివ్వకుండా కుట్ర చేశారు: విష్ణు
పార్టీ-ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలతో క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా ఉందని వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఇక, ఉగాది తరువాత అత్యధిక సమయం జనంలోనే ఉండాలనేది సీఎం జగన్ ఆలోచనగా స్పష్టమవుతోంది. దీని ద్వారా అటు ప్రభుత్వం.. ఇటు పార్టీలోనూ సమూల మార్పులు.. స్పష్టమైన లక్ష్యాలతో సీఎం జగన్ ముందస్తు ఎన్నికల కోసం సిద్దం అయ్యే దిశగా అడుగులు వేస్తారని పార్టీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరును కూడా ఈ సందర్భంగా జగన్ పరిశీలించనున్నారని అంటున్నారు.
కొందరు ఎమ్మెల్యేలు గత మూడేళ్లుగా వ్యాపారాలపై దృష్టి పెట్టి నియోజకవర్గాలను విస్మరించారు. ఈ నేపథ్యంలో వారికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి, మార్పు రాకపోతే కఠిన నిర్ణయం తీసుకోవాలని కూడా జగన్ భావిస్తున్నారట. వచ్చే జూన్ నాటి నుంచి పార్టీపైన దృష్టి పెట్టడంతో పాటు జిల్లాల పర్యటనలు కూడా చేయాలని జగన్ నిర్ణయించారు. ప్లీనరీ నుంచి పూర్తిగా రాజకీయ వ్యవహారాలపైనే జగన్ దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Fact Check: ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న సీఎం జగన్..?.. అసలేం
ఇక, మిగిలిన ఒకటిన్నరేళ్ల కాలం సీఎం జగన్ పూర్తిగా ప్రజలతోనే ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం అవుతుందని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణలో 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ సడన్ గా ముందస్తుకు వెళ్లి.. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా చేసిన విధంగానే.. జగన్ సైతం అదే బాటలో నడవనున్నారని తెలుస్తోంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.