ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు అధికార పక్షంలోను, ఇటు విపక్షంలోనూ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, అధిప్యత పోరు ఎలా సాగుతుందో చూస్తూనే ఉన్నాం. నాయకులు వ్యక్తిగత ఈగోలు పార్టీలకు ప్రమాదంగా మారాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన చాలామంది కీలక నేతలు రాజకీయాలకు దూరంగా.. నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.
ఉత్తరాంధ్రలో టీడీపీ కీలక నేత గంటా శ్రీనవివాసరావు పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి గంటా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు, సమస్యలను పరిష్కారం చేయడానికే గంటా పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో నేడు చంద్రబాబు నాయుడు-గంటా శ్రీనివాస్ రావు మధ్య కీలక భేటీ జరగనుంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి : 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓటమికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఎన్నికల తర్వాత నుంచి పార్టీకి దూరం..
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గంటా పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి చంద్రబాబు 36 గంటల దీక్ష చేసినప్పడు కూడా అటు వైపు చూడలేదు. అయితే ఆయన కావాలనే పార్టీకి దూరంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మూడేళ్ల కాలంలో చంద్రబాబు కూడా గంటా శ్రీనివాసరావు విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా గంటా తీరు చూస్తే.. భవిష్యత్తులో పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు తిరిగి ఆయనను పార్టీలో యాక్టీవ్ గా పని చేసేలా చూడాలని భావిస్తున్నారట.
కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేస్తున్న గంటా..
ఏపీ రాజకీయాల్లో కాపు, కమ్మ సామాజిక వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వీరి మద్దతు ఎవరికి ఉంటే.. వారిదే అధికారం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. రాష్ట్రంలో 19 శాతం వరకు ఉన్న కాపుల మద్దతు ఎవరికి దక్కితే.. వారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం ఏపీలో కాపు సామాజిక వర్గంలో ముఖ్యనేతలు ఎవరు టీడీపీకి పెద్దగా మద్దతు ఇవ్వడం లేదు. వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ పూర్తిగా టీడీపీకే మద్దతు ఇస్తాడా అంటే.. కచ్చితంగా చెప్పలేం. ఇక మరో నేత ముద్రగడ పద్మనాభం.. టీడీపీకి దూరం అయ్యారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినప్పటికి.. ఆయన స్వయంగా పార్టీ స్థాపించారు. కనుక ఈ విషయంలో ఆయన టీడీపీతో కలిసి వస్తారంటే.. డౌటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన గంటాను దూరం చేసుకుంటే.. టీడీపీకి మరింత నష్టం అంటున్నారు విశ్లేషకులు.
ఇది కూడా చదవండి : చంద్రబాబు మౌనం దేనికి సంకేతం? టీడీపీలో ఏమి జరుగుతోంది?
ప్రస్తుత భేటీ అందుకే..
ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న గంటా.. రాష్ట్ర కాపు సామాజికవర్గం నేతలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాపులకు అధికారం దక్కాలని ఆయన సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో రాజకీయాలలో కీలకంగా ఉన్న కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి గంటాతో పాటు.. అన్ని పార్టీలకు చెందిన కాపు నేతలు హాజరయ్యారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుతం గంటా కాపు నేతలను ఏకం చేసే పనిలో పడ్డారని సమాచారం. దీని గురించి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేరుతుందట.
ఈ క్రమంలో కాపు సామాజికవర్గంలో కీలకంగా ఉన్న గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరం కాకుండా ఉండేలా చూడాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందుకే ఆయనతో భేటీకి సిద్ధం అయ్యారని సమాచారం. గంటా శ్రీనివాసరావుతో పాటు ఉత్తరాంధ్రలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కీలక నేతలను కూడా చంద్రబాబు సమావేశానికి పిలిచారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.